వివేక్‌ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఏదో తప్పు అతనిని స్థిమితంగా ఉండనివ్వడంలేదనిపిస్తోంది. రెండు రోజుల్నుంచీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. దీర్ఘాలోచన. అంతకుమించి ఏదో భయం అతన్ని కలచివేస్తోంది.పాతికేళ్ల వైవాహిక జీవితంలో వివేక్‌ను ఎప్పుడూ అలా చూడలేదు. 

అంత బాధపెడుతున్న విషయం ఉన్నప్పుడు నాతో చెప్పకోవచ్చుగా. తప్పేముంది. ప్రతి విషయంలోనూ ఒకళ్ళనొకళ్ళం సంప్రదించుకునే అలవాటు లేనివాళ్లమేం కాదు. మా మధ్య దాపరికాలేమీ లేవని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీలవుతాను. అవమానాలు ఎదురైనా, ఆనందంతో పొంగిపోయే విషయమైనా ఇద్దరం పంచుకుంటాం. ఒకరి మనసు మరొకరికి తెలుసు. జీవితంలో ఎవరికైనా పొరపాట్లు ఎదురవుతాయి. తప్పులు దొర్లుతాయి. దాచుకోవాల్సిన పనిలేదు, కొన్ని సమస్యలు సంప్రదించుకున్నప్పుడు ఇద్దరి ఆలోచనలు ఒకటైతే చక్కని పరిష్కారం లభిస్తుందని నా నమ్మకం.రాత్రి పదకొండు దాటింది.పదిగంటలకల్లా పడుకోవాలనిచెప్పే వివేక్‌ టీ.వీ ముందుకూర్చుని చేతిలో రిమోట్‌పెట్టుకుని పిచ్చిపిచ్చిగా చానల్స్‌ను సర్ఫ్‌ చేస్తున్నాడు.

దృష్టి స్ర్కీన మీద కూడా లేదని అర్థమైపోతోంది.‘‘ఏమిటండీ విషయం’’ అని అడిగినప్పుడు కూడా అతను దృష్టి మరల్చలేదు. పరధ్యానం వినబడకుండా చేసిందేమో అని సర్దుకుని ‘‘ఏమండీ మిమ్మల్నే ఏమిటీ పరధ్యానం దేనిగురించి మీ ఆలోచన, నాకూ చెప్పొచ్చుగా’’ గట్టిగా అడిగాను.నాకేసి చూశాడు. ఆ చూపు మామూలుగా లేదు. ఏదో పిశాచం ఆవహించినట్లుగా అనిపించింది. చూపు మాట ఎలా ఉన్నా విషయం బయటికొస్తుందని ఆశించాను. అదేం జరగలేదు.టీ.వీ. ఆఫ్‌ చేసి రిమోట్‌ సోఫామీద పడేసి లేచాడు. బెడ్‌రూంలోకి వెళ్లి పడుకున్నాడు.దిక్కు తోచలేదు నాకు.ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ సరదాగా గడిపే మనిషి ప్రవర్తన ఇలా మారిపోయిందేమిటి? అనే సందేహం భయం నన్ను పీడించడం మొదలుపెట్టాయి.