లక్ష్మీపతి అనే చిల్లరకొట్టు వ్యాపారికి లక్షలు సంపాదించాలనే కోరిక ఉండేది. ఆ కోరిక తీర్చుకునే మార్గం తెలుసుకోవడానికి అతడొక సాధువును ఆశ్రయించాడు. సాధువు చెప్పినమార్గం అనుసరించి ధనవంతుడయ్యాడు లక్ష్మీపతి. కానీ అతడికి మనశ్శాంతి కరువైంది. తన సంపదను దొంగలెత్తుకుపోతారనే భయం పట్టుకుంది. దాంతో సాక్షాత్తూ ఆ దేవుళ్ళనే తన ఇంటికి కాపలా పెట్టుకున్నాడు లక్ష్మీపతి. అప్పుడు దేవుళ్ళు చేశారు?

ఒకఊరులో లక్ష్మీపతి అనే చిల్లరకొట్టువ్యాపారి ఉండేవాడు. అతడికి వ్యాపారంలో లక్షలు ఆర్జించి మేడలు కట్టాలని ఆశ ఉండేది. ఒకసారి ఆ ఊరికి బాగా పేరున్న సాధువు వచ్చాడు. లక్ష్మీపతి ఆయన దగ్గరకువెళ్ళి ‘‘స్వామీ, నేను వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించాలంటే ఏం చేయాలి?’’ అని అడిగాడు.‘‘దేనికైనా దైవం సానుకూలపడాలి. నీకు తెలిసిన దేవుళ్లందర్నీ ప్రార్ధించుకుని, వ్యాపారం చెయ్యి. నీకు మేలు జరుగుతుంది. నీ కోరిక తప్పక సిద్దిస్తుంది’’ అన్నాడు సాధువు.లక్ష్మీపతి అలాగే చేయడం ప్రారంభించాడు. అప్పటినుంచీ అతడికి వ్యాపారంలో కలిసిరావడం మొదలైంది. కొన్నిసంవత్సరాలు గడిచేసరికి లక్ష్మీపతి ఇల్లు ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, సిరిసంపదలతో, పిల్లాపాపలతో కళకళలాడసాగింది.

అయితే, లక్ష్మీపతికిమాత్రం సుఖసంతోషాలులేవు. తన సంపదను ఇతరులు దోచుకుపోతారని అనుక్షణం బెంగపడేవాడు. ఆయన ఇంటికి బలమైనకాపలా కూడా ఉంది. కానీ లక్ష్మీపతి కాపలావాళ్లను కూడా నమ్మలేకపోయేవాడు. వాళ్ళు తనను మోసగిస్తారని ఆయన అనుమానం. ఈ మనస్తాపం భరించలేక- ఒకరోజు లక్ష్మీపతి మళ్లీ సాధువుదగ్గరకి వెళ్ళాడు. ఆయనకు తన మనసులోని బాధ చెప్పుకున్నాడు. ‘‘డబ్బున్నవాడు పిలిస్తే దేవుళ్ళు పలుకుతారు. నువ్వు దేవుళ్ళనే నీ ఇంటికి కాపలాగాపెట్టుకోవచ్చు. అందుకు ఇదివరకటిలాగే నీ ఇష్టదైవాల్ని ప్రార్థించుకుని ప్రసన్నుల్ని చేసుకో’’ అని సాధువు లక్ష్మీపతికి సలహా ఇచ్చాడు.లక్ష్మీపతి వెంటనే కోదండరాముడి గుడికివెళ్ళి శ్రీరాముడిముందు రెండుచేతులూ జోడించి తన కోరిక చెప్పుకున్నాడు.

అప్పుడతడికి శ్రీరాముడు ప్రత్యక్షమై, ‘‘ఈ రోజునుంచి, నా నమ్మిన బంటు ఆంజనేయుడు నీ ఇంటికి కాపలాగా ఉంటాడు’’ అని చెప్పి మాయమయ్యాడు.లక్ష్మీపతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచీ ఆంజనేయస్వామి లక్ష్మీపతి ఇంటికి కాపలాగా ఉంటున్నాడు. అప్పట్నించీ లక్ష్మీపతి రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోతున్నాడు. అలా అతడి మనసుకి సుఖశాంతులు లభించాయి. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఈలోగా, ఒక దొంగవాడికన్ను లక్ష్మీపతి ఇంటిమీద పడింది. ఆ ఇల్లొక్కటి కొల్లగొడితే, తరతరాలపాటు, తనూ తన కుటుంబం హాయిగా జీవించవచ్చునని వాడికి అనిపించింది. అందుకు దొంగ దూరాలోచనతో పథకం వేశాడు. ముందుగా లక్ష్మీపతి ఇంటి కాపలావాళ్ళకు లంచంపెట్టి, బహుమతులిచ్చి, నెమ్మదిగా మచ్చికచేసుకున్నాడు. తర్వాత వాళ్ళనే అడిగి ఆ ఇంటి ఆయువుపట్లన్నీ తెలుసుకున్నాడు. తర్వాత ఒక మంచిరోజు చూసుకుని దొంగతనానికి ఆ ఇంట్లో ప్రవేశించాడు.