ధైర్యం చేసి ‘మీతో ఫోన్‌లో మాట్లాడాలని ఉంది’ అడిగేసాడు. రియాక్షన్‌ ఎలా ఉంటుందో అని కొద్దిగా ఆందోళన పడ్డాడు. ‘అయ్యో... నాక్కూడా. కాని నా అంతట నేనెలా చొరవ తీసుకుంటాను.. ఆడ పిల్లను కదా!’’ అటునుండి సందేశం రాగానే తన ఆందోళన హుష్‌ కాకి!

‘మీ కథ అద్భుతం. మీరు కథలో చెప్పినట్టుగానే నా జీవితంలో జరిగింది. మీరింకా చాలా కథలు రాయాలి - సునంద, నెల్లూరు.’మెసేజ్‌ని ఎన్ని సార్లు చదివాడో లెక్కే లేదు శశికిరణ్‌. ఆ వర్ధమాన రచయిత పెదాలపైనవ్వు విరిసింది. ‘మీ అభిమానానికి కృతజ్ఞతలు..’ క్లుప్తంగా జవాబిచ్చాడు. ఎక్కువ స్పందిస్తే డిగ్నిటీ ఉండదని! మళ్ళీ ఏదైనా సందేశం వస్తుందని చూశాడు కాని, వెంటనే రాలేదు. కొద్దిగా ఆశాభంగం కల్గింది.రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత టింగుమని మెసేజ్‌ అలర్ట్‌ రాగానే దిగ్గున ఫోన్‌ అందుకున్నాడు. సునంద నుండే..‘మీరు నాతో స్నేహం చేస్తారా?’మనసు ఒక్కసారిగా విహంగమైంది. ‘అమ్మాయి అడిగితే కాదనేవాడు ఉంటాడా?’ ఫోన్‌ చేద్దాం అనుకున్నాడు. కాని అంత రాత్రివేళ బాగుండదని ఆలోచన విరమించుకున్నాడు. ‘నేను కూడా మీతో స్నేహం చెయ్యడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ రిప్లయి ఇచ్చాడు.

‘వాట్సప్‌ నెంబరుంటే పంపమని’ మరో మెసేజ్‌. వెంటనే పంపాడు. గోడకి కొట్టిన బంతిలా బదులు వచ్చింది.రెండు రోజుల్లో వాట్సప్‌ సాక్షిగా ఇద్దరి మధ్యా నిర్విరామంగా కొన్ని వందల ఆలోచనలు అటు ఇటు ప్రయాణం చేశాయి. వీడియోలు, కొటేషన్లు, జోకులు, వ్యక్తిగత వివరాలు సైతం ఒకరికొకరు పంపుకున్నారు. అనుబంధం పెరిగింది.‘సునంద ప్రొఫైల్‌ ఫోటో చాలా అందంగా ఉంది. బయట ఇంకెంత బాగుంటుందో? ఆమెను కలుసుకునే భాగ్యం ఎప్పుడు లభిస్తుందో?’ శశికిరణ్‌ ధ్యాసంతా సునంద మీదే!‘శశికిరణ్‌ ఎంత హ్యాండ్సంగా ఉన్నాడు! ఆ నవ్వు ఎంత మ్యాన్లీగా ఉంది’ సునంద ఆలోచనలు ఇవి.

అప్పటివరకు కేవలం సందేశాలతో కాలం గడిపారు. అది కాస్తా బోరు కొట్టింది. ఒక రోజు ధైర్యం చేసి ‘మీతో ఫోన్‌లో మాట్లాడాలని ఉంది’ అడిగేసాడు. రియాక్షన్‌ ఎలా ఉంటుందో అని కొద్దిగా ఆందోళన పడ్డాడు. ‘అయ్యో... నాక్కూడా. కాని నా అంతట నేనెలా చొరవ తీసుకుంటాను.. ఆడపిల్లను కదా!’’ అటునుండి సందేశం రాగానే తన ఆందోళన హుష్‌ కాకి! ఇద్దరి మధ్య ఉన్న గట్టు తెగిపోయి, మాటల వరద ప్రవహించింది.