మా ఆఫీస్‌ స్టాపంతా లంచ్‌కెళ్ళారు. వాళ్లంతా గంటగ్గాని రారు. ఆఫీసులో నేనొక్కడినే ఉన్నాను. బయటమాత్రం ఆఫీసు ఫ్యూన్‌ కూర్చున్నాడు.నేనూ లంచ్‌కెళ్ళాల్సిన వాడినే. రెండురోజుల నుంచి లీవ్‌లో ఉన్నాను. ఈ రోజే ఆఫీసు కొచ్చాను. నేనొచ్చేసరికి చాలా ఫైల్స్‌ పెండింగులో ఉన్నాయి. వాటిలో అర్జెంట్‌ ఫైల్స్‌ని క్లియర్‌ చేసి వెళ్ళొచ్చని వాటిని చూస్తూ కూర్చున్నాను.ఇంతలో ఫ్యూనొచ్చి చెప్పాడు ‘‘మీ కోసం ఎవరో వచ్చారు తీసుకురమ్మంటారా’’ అని.సరే రమ్మన్నాను. ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. అతనికి నలభై ఏళ్ళుండొచ్చు. సఫారీలో ఉన్నాడు. నుదుటి మీద కుంకుమ బొట్టు. దైవభక్తుడిలా ఉన్నాడు. చేతిలో బ్రీఫ్‌ కేసుంది.‘‘నమస్తేసార్‌’’ అన్నాడు వచ్చిన వెంటనే.‘‘కూర్చోండి’’ అన్నాను. 

నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఫ్యూన్‌ బయటకెళ్ళిపోయాడు.‘‘చెప్పండి’’‘‘నా పేరు రాజు సార్‌. మాది విజయనగరం దగ్గర్లో పల్లెటూరు. ఇప్పుడక్కడి నుంచే డైరెక్టుగా వస్తున్నాను. నేను సాయిబాబా భక్తుణ్ణిసార్‌. నేను ముఖం చూసి మీ గురించి చెప్పగలను సార్‌. గతంలో జరిగిపోయినవి, భవిష్యత్తులో జరగబోయేవి అన్నీ చెప్పగలను. చాలా పెద్దపెద్ద వాళ్ళు నా చేత చెప్పించుకున్నారు. ఇవిగో చూడండి’’ అంటూ బ్రీఫ్‌కేసులో నుంచి తీసిన ఓ ఫోల్డర్‌ని నా చేతికిచ్చాడు.అందులో ఓ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ గారు, ఓ మెడికల్‌ కాలేజీ చైర్‌మన్‌ గారూ, ఓ రాజకీయ నాయకుడు వ్రాసిన కాంప్లిమెంటరీ లెటర్స్‌ ఉన్నాయి. వాళ్ళతో అతను తీయించుకున్న ఫోటోలు వాటితో పాటు ఉన్నాయి. అందరూ వ్రాసిన వాటి సారాంశం ఒక్కటే.‘‘ఈయన ఫేస్‌రీడర్‌. మన ముఖం చూసి చెప్పే విషయా లన్నీ యదార్థాలే.

మా విషయంలో కూడా ఈయన చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఫేస్‌రీడింగ్‌లో ఇతనంత గొప్పవాడు మరొకడుండేమో’’.నిజానికిలాంటివి ఇష్టముండదు. గతం గురించి చెప్పడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. భవిష్యత్తులో జరగబోయేవి జరగక మానవు. ముందుగా తెలిస్తే మాత్రం ఏం చేయగలుగుతాం. చెప్పే విషయాల్లో ఏమైనా నెగిటివ్స్‌ ఉంటే కృంగిపోతాం. అసలు నిజంగా ఒకరి భవిష్యత్తు గురించి మరొకరు ఎలా చెప్పగలుగుతారు.‘‘మీరేం ఆలోచిస్తున్నారో నేను చెప్పగలను సార్‌. మీ భవి ష్యత్తు గురించి నేనెలా చెప్పగలనా అని కదూ’’ నా మనసులోని మాట చదివినట్లు చెప్పాడు.