‘‘పరాజితుడు – ఏకపాత్రాభినయం. రచన, నటన, దర్శకత్వం ఫలానా!’’బెలగాం చర్చివీథి అర్బన్ కోపరేటివ్ బ్యాంక్‌లో, ఏటా సహకార వారోత్సవాలు జరిగేకాలంలో, ఓ ఏడాది వేదిక మీద తెరవెనుక నుంచి పీలగొంతుతోచేసిన అనౌన్స్‌మెంట్ ఇది.

ఎవడో? ఏమిటో? అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎందుచేతో తెర లేవడం కొంచెం ఆలస్యమైంది. ఎవడో ఈల వేశాడు. ‘‘బేగి లేపెసే....’’ తెర లేపమంటూ మరొకడు అరిచాడు. జనం నవ్వారు. కర్టెన్ లాగే తాడుతో తిరకాసొచ్చింది. తెర ఓ పట్టాన జరగటం లేదు. దమాయించి లాగితే సగంవరకు వచ్చి ఆగిపోయింది. వెంటనే రంగాలంకరణ నిపుణుడు పాలంకి నాగేశ్వరరావు చెయ్యి చేసుకున్నాడు. జనం కంటపడకుండా తెరచాటుగా స్టేజిమీదికొచ్చాడు. తెర కుచ్చెళ్లు పట్టుకుని మరోకొసకి బరబరా లాగాడు.అది చూసిన ప్రేక్షకులు సర్దుకున్నారు. తెర లేపమంటూ ఇందాక అరిచిన గొంతు, ‘‘రైట్..రైట్..ఇగ్గానీ...’’ అంది. ప్రదర్శన మొదలైంది. స్టేజ్ మీద చిమ్మచీకటి. మెల్లగా ఒక్కో లైటూ వెలిగాయి. ఎదురుగా ఓ యువకుడు.

శూన్యంలోకి నిరాశగా చూస్తూ, పోతపోసిన వైరాగ్యం లాగా ఉన్నాడు. మాసిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, చెదిరిన జుట్టు, మాసికలు వేసిన కల్లీషర్టు, షరాయిలో సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. లైట్లు వెలిగిన కొద్దిక్షణాలకే ‘‘హ్హహ్హహ్హ.....’’ అంటూ వెర్రిగా నవ్వాడు. నవ్వుతూనే ప్రేమను తిట్టాడు. ప్రేమికులను ఛీ కొట్టాడు. సమాజంలో పెద్దల్ని శపించాడు. సంస్కారంలేని సంఘాన్ని జల కడిగేశాడు.వేదికమీద ఏకపాత్ర ఎందుకలా తిడుతోందో జనానికి అర్థం కాలేదు. ఏకబిగిన సాగుతున్న తిట్ల పరంపర ఎప్పుడు ఆగుతుందో ప్రేక్షకుల అంచనాలకు అందటం లేదు. ఒక్కసారిగా, ‘‘అప్పుడేమైందంటే...’’ అంటూ పాత్ర గతంలోకి వెళ్ళింది.

తన ప్రేమ ఎందుకు చెడిందో, తనకీ ప్రేయసికీ మధ్య సంఘం అడ్డంగా ఎలా నిలబడిందో వివరించబోయింది. వినడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటే కదా? వాళ్లకి మాచెడ్డ చిరాగ్గా ఉంది. ఆ ఏకపాత్రాభినయానికి ముందు ‘అంధకారం’ అనే నాటిక వేశారు. దాన్ని ఆ కోపరేటివ్ బ్యాంక్‌లో పనిచేసే ఎం.ఎస్.ఎన్. రాజుగారు రాసి, ఆయనే ముఖ్యపాత్ర వేశారు. దాన్నిండా కష్టాలూ, కన్నీళ్ళే. నాటిక చివర్లో శవంమీదపడి పాత్రలు ఏడుస్తుంటే తెరపడింది. ప్రేక్షకులు ఆ విషాదం నుంచి తేరుకోలేదు కాబోలు ఏకపాత్రాభినయం రూపంలో విఫల ప్రేమికుడి విషాదాన్ని భరించలేకపోయారు.