ఆ అడవిలోని ప్రతి చెట్టుకూ ఆత్మ ఉంటుందని ఆ గూడెంవాసులు మనస్ఫూర్తిగా నమ్ముతారు. చెట్టును దైవంగా పూజిస్తారు. జంతువులను పక్షులను తమ బిడ్డల్లా ప్రేమిస్తారు. జంతుకూనలను తమ పసిబిడ్డలతో సమానంగా లాలిస్తారు. చెట్లు, జంతువులు కూడా ఆ గూడెం జనాభాలో ఒక భాగమే.

అలాంటి రమణీయమైన అడవిలో ఒకచోట కాడమల్లిచెట్టుకింద రాలిపడ్డపూలు పూలపానపులా అమరిపోయాయి. వారిద్దరి సరాగాలకు ప్రకృతి పరవశిస్తుంటే, వారి సయ్యాటలకు చెట్టూ చేమా పులకించిపోయాయి. ఆమె సొగసరితనానికి ధీటుగా అతని మగసిరి. ముకుంద్‌ కన్నుల్లో వెల్లువై ప్రవహిస్తున్న ప్రేమకు తనను తాను మరచిపోయి బిడియాన్ని పక్కికిపెట్టి అతనివైపే తదేకంగా చూస్తోంది చందన.చెవిలో గుసగుసగా ముకుంద్‌ చెప్పినమాటకి చందనమొహం మంకెనపువ్వుని మించిన ఎర్రదనంతో మెరిసింది. సిగ్గుతో రెండుచేతులతో మొహం దాచుకుంది. సుతారంగా ఆమె చేతుల్ని పక్కకి తప్పించాడు. వాలి ఉన్న కనురెప్పలపై, వలపు నిగ్గుతేలి నునుపెక్కిన బుగ్గలపై, మంచులో తడిసిన గులాబీరేకుల్లాంటి పెదవులపై, మంకెనపూలమాలతో అలంకరించుకున్న సొగసైన మెడపై మృదువైన ముద్దులతో ప్రేమ సంతకాలు చేశాడు.

సర్వస్వాన్నీ మరచిపోయి ముకుంద్‌ కౌగిలిలో కరిగిపోతున్న చందన పయ్యెద పైనుండి జీరాడుతున్న వస్త్రపుకొంగును ముక్కుతో పట్టుకుని లాగింది అక్కడే తచ్చాడుతున్న నెమలి ఒకటి. తలతిప్పి చూసిన ఆమెకి సమయం గుర్తుచెయ్యడానికన్నట్లుగా క్రేంకారం చేసింది. సూర్యుడు కొండలనడుమకి వెళ్లిపోవడంతో పొద్దువాలిపోయి చీకట్లు ముసురుకుంటున్నాయి.‘‘ఇంక ఇంటికెళ్ళాలి, అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది’’ అంది చందన పూలదండలా అతని మెడచుట్టూ వేసిన చేతుల్ని తియ్యకుండానే. ఆమె నడుముచుట్టూ చేతులేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు ముకుంద్‌. ‘‘మళ్ళీ ఎప్పుడు..?’’ అన్నాడు.‘‘మనువయ్యాకే’’ అంది చందన నవ్వుతూ.‘‘పద నిన్ను ఇంటిదగ్గర దింపుతాను. నాకు కొంచెం వేరే పనుంది’’ అన్నాడు ముకుంద్‌.