పిల్లాడిని చంకనేసుకుని టాక్సీ దిగిన జానకి గుమ్మంలో అడుగుపెట్టింది.‘‘ఉండమ్మా, అక్కడే ఉండు, పిల్లాడికి దిష్టి తియ్యాలి’’ సుభద్రమ్మ ఆజ్ఞ జారీచేసి లోపలికి వెళ్ళి అప్పటికే సిద్ధం చేసి ఉంచుకున్న పళ్ళెం తీసుకుని బయటకు వచ్చింది. ఆమె వచ్చేవరకు జానకి అలాగే నిలబడి ఉంది. పిల్లాడు ఒంటిమీదనుంచి జారిపోతున్నాడు. వాడికి ఎక్కిళ్ళు వస్తున్నాయి.‘‘ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ, నీకీ మధ్య చాదస్తం ఎక్కువైపోతోంది’’ విసుకున్నాడు శేఖర్‌.

‘‘బాగుందిరా, మొట్టమొదటిసారి కోడలు పిల్లాణ్ణి ఎత్తుకుని అత్తారింటికొస్తే దిష్టి తియ్యొద్దురా? అందులోనూ గుమ్మటంలా ఉన్నాడు వెధవ, అసలు వాడికి నా దిష్టే తగులుతుందేమో అన్నంత భయంగా ఉంది నాకు, ఇక దారిలో ఎందరి కళ్ళుపడుంటాయో ఏమో’’ సుభద్రమ్మ రంగునీళ్ళు దిష్టి తీసి అవతల పారబోసింది. పిల్లాడితో లోపలికి అడుగుపెట్టింది జానకి. శేఖర్‌ సామాన్లు లోపలికి చేరవేస్తున్నాడు. చంటాడికి ఎక్కిళ్ళు ఆగడం లేదు.‘‘ఏమయిందే వాడికి’’ సుభద్రమ్మ అడిగింది.‘‘ఏమో అత్తయ్యా గంటబట్టీ వస్తున్నాయి. రైల్లోనే మొదలయ్యాయి’’ కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకి.

‘‘ఓసి పిచ్చిదానా, దానికేనా కన్నీళ్ళు? వాణ్ణి తీసుకుని నాతో రా’’ అని వంటింట్లోకి దారితీసింది సుభద్రమ్మ. స్టవ్‌ అంటించి ఓ గిన్నెలో నీళ్ళు కాచింది. తర్వాత ఆ గిన్నెతో సహా జానకిని చంటాడితో తనగదిలోకి తీసుకెళ్ళింది. మూలనున్న సందుగుపెట్టెని గదిమధ్యలోకి తీసుకొచ్చింది. ఆ సందుగుపెట్టెలో ఏముందో అంతవరకూ జానకికి తెలియదు.ఆ సందుగుపెట్టె మూత తీసి, సుభద్రమ్మ పైనున్న రెండు అరలూ బయటికి తీసేసింది. అడుగున ఏవో చిన్నచిన్న వెండి సామాన్లు ఉన్నాయి. అందులోంచి ఉగ్గుగిన్నె బయటకు తీసింది.