లక్ష్మి భారంగా అడుగుతీసి అడుగేస్తోంది. దాని తీరుచూసి వీరయ్యగుండె చెరువైపోతోంది.‘ఏటైంది దీనికి...మరీ నీరసంగా అడుగులేస్తోంది, మూడురోజులనుంచి ఇదే వరస!ఏటో నాకేటీ బోధపడ్డంనేదు. ఓపాలి డాకటేరుకాడికి తీసుకెలితే బాగుంటాదేమో, ఏటి సెయ్యడమో ఏటో. చేతిలో కానీ నేదు. కాలూ చేతులు ఆడ్డంనేదు’ లక్ష్మి వెంట నడుస్తున్న వీరయ్య తెగబాధపడుతున్నాడు.

వీరయ్య ఆవుపేరు లక్ష్మి. పాతికేళ్లక్రితం అతను మూడుపదుల వయసులో ఉన్నప్పుడు పెద్దావుకు పుట్టిందది. పుట్టిన వెంటనే తల్లి చనిపోవడంతో దూడపెయ్యిని సాకడం అప్పట్లో వీరయ్యకు కత్తిమీద సామైపోయింది. ఎలాగోలా దాన్ని బతికించుకున్న అతనికి దానిపై వల్లమాలిన అభిమానమైంది. అప్పటినుంచి అతని బిడ్డల్లో ఒకటైపోయిందది.దానికి లక్షుమ్మఅని తన తల్లిపేరు పెట్టుకున్నాడు. మాలచ్చిమి అని ముద్దుగా పిలుస్తుంటాడు. లక్ష్మి కూడా వీరయ్య రుణం ఉంచుకోలేదు. పాలు, పేడ, బిడ్డలతో అతని అవసరాలన్నీ తీర్చుకుంటూ వచ్చింది. అతని అరెకరాపొలంపై వచ్చే ఆదాయానికి వేన్నీళ్ళకు చన్నీళ్లులా సాయపడింది. అందుకే ఇప్పుడు వట్టిపోయినాగానీ వీరయ్యకు లక్ష్మిమీద కొంచెంకూడా తగ్గలేదు.

దానికి ఏదైనా అయితే కన్నబిడ్డకే జరిగిందన్నట్టు విలవిల్లాడిపోతుంటాడు. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఉన్న అరెకరాతో జీవితం హాయిగా ఎల్లిపోతోంది. అయినా ప్రస్తుతం వీరయ్యకున్న ఏకైక బాధ్యత ఆ ఆవు మాత్రమే. ఉదయం, సాయంత్రం దాన్ని మేతకు తీసుకువెళ్లడం, దాని ఆలనాపాలనా చూడడం వీరయ్య ముఖ్యమైన పనిగా మారింది.ఉదయం మేతకు తీసుకువెళ్లి దాన్ని ఎక్కడెక్కడోతిప్పి కడుపునిండిందని భావించాక ఇంటికి తెస్తున్నాడు. ఆవు నీరసంగా ఉండడంచూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికి వచ్చేసరికి వీరయ్య కూడా బాగా అలసిపోయాడు. గోవును శాలలో కట్టేసివచ్చి ఇంటి అరుగుమీద కూలబడిపోయాడు. మిట్టమధ్యాహ్నం ఎండసుర్రుమంటోంది. తిరిగితిరిగి రావడంతో ఒంట్లోసత్తువంతా ఇంకిపోయినట్టుంది వీరయ్యకు.