అతడి తాతకీ, తండ్రికీలేని గొప్ప అదృష్టం అతడినే వరించింది.. బాగా సంపాదించాడు. శంకుస్థాపన చేసి ఒక అందమైన డూప్లెక్స్‌ ఇల్లు కట్టుకున్నాడు. ఘనమైన ఏర్పాట్లతో గృహప్రవేశంకూడా చేశాడు. అంతటి మహద్భాగ్యం అందరినీ వరించదు. సిద్ధాంతి కూడా ఆ మాటే చెప్పాడు. అందుకే గృహప్రవేశానికి చాలా పవర్‌ఫుల్‌ ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం ఎంత పవర్‌ఫుల్లో కూడా చివరాఖరికి అతడికి తెలిసొచ్చింది!!

‘‘డాడీ, సాధుజంతువు అంటే ఏంటి?’’ నాలుగేళ్ళ చింటూ తండ్రిని అడిగాడు.‘‘ఆవు సాధుజంతువు. అంటే సాధువులాగా సాత్వికమైనది. ఉత్తమమైన మంచిజంతువు. మేలు చేసేది, హాని చేయనిది, మెత్తనిది’’ సన్యాసిరావు చెప్పాడు.‘‘మెత్తనిదంటే రబ్బరులా మెత్తగా ఉంటుందా?’’ అంటూ నవ్వాడు.కుర్రవెధవ, చెప్పింది వినకుండా ఎగతాళిగా మాట్టాడేసరికి ఉడుకుమోత్తనం వచ్చింది సన్యాసిరావుకి. ‘‘చాల్లే, నోర్ముయ్‌. పెద్దమాటలు నువ్వూనూ’’ విసుక్కున్నాడు.అమ్మతల్లిలా అమాంతం వచ్చిపడిపోయింది శారద. ‘‘ఉరుమురిమి మంగళంమీద పడ్డట్టు మధ్యలో వీడిమీద కోప్పడతారేంటి. చేతనైతే తిన్నగా చెప్పండి, లేదా నోరు మూసుకోండి. వీడిని చిన్నెత్తు మాటన్నా ఊరుకోను. వీడు నా బంగారుకొండ’’ చింటూని ముద్దు చేస్తూ అంది.‘‘నువ్వు అమ్మరాక్షసివని మరచిపోయాను’’ చిన్నగా నవ్వుతూ లెంపలేసుకున్నాడు.కళ్ళెర్రజేసింది. తడబడ్డాడు.

‘‘ఏదో సరదాగా...’’ గబుక్కున ముఖకవళికలు మార్చేసి గొణి గాడు.‘‘మీ వేషాలు కట్టిపెట్టి, వెళ్ళి గృహప్రవేశానికి మంచి ముహూర్తం పెట్టించుకురండి. ఈ మాయదారి అద్దెకొంపకి చాకిరీ చెయ్యలేక చస్తున్నా’’ విసుగు, కోపం కలగలిపి అంది అతని భార్య శారద. ఆమె పేరుకీ మాటకీ, రూపానికీ ఎక్కడా పొంతన ఉండదు. మొగుడు ఆఫీసరైనా ఆమె ముందు నౌకరే.‘‘ఇదిగో వెళ్తున్నా’’‘‘ఎలాగైనా వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టించుకురండి’’‘‘అలాగే, అలాగే’’ అంటూ హడావిడిగా స్కూటర్‌ బయటికితీసి స్టార్ట్‌ చేశాడు సన్యాసిరావు. తిన్నగా నారాయణ సిద్ధాంతి ఇంటికెళ్ళాడు. అప్పటికే అక్కడ ఆయనకోసం ఐదారుగురు వేచి ఉన్నారు.

అయినప్పటికీ సన్యాసిరావుని గుర్తించి ముందుకు రమ్మని ప్రత్యేకంగా పిలిచారు సిద్ధాంతి.‘‘రండి సన్యాసిరావుగారూ, ఇలా కూర్చోండి. వచ్చిన పని చెప్పండి’’ అడిగారు పద్మాసనం వేసుకూర్చున్న సిద్ధాంతి.‘‘డూప్లెక్స్‌ హౌస్‌ కట్టానండి. దాదాపు నలభైలక్షలు ఖర్చు అయింది. చూసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకుంటున్నారు. గృహ ప్రవేశానికి దివ్యమైన ముహూర్తం పెట్టాలి. ఆ ఇంట్లో మేమే కాదు, మా పిల్లలూ, వాళ్ళ పిల్లలూ ఎంతో హ్యాపీగా జీవించాలి. అంతా ఎప్పుడూ మిమ్మల్నే తలచుకోవాలి’’ ఉబ్బేశాడు.