ఎండ కరకరలాడుతోంది.ఉదయపు నడక అయింది.ఇంటికి చేరి హాల్లో కూచున్నాను. మొహాన పట్టిన చెమట తుడుచుకుని కళ్ళు మూసుకుని ఊపిరిపీల్చుకున్నాను.‘‘మావయ్యగారూ ... కాఫీ’’ అన్న కోడలు రేఖ పిలుపుతో ఉలిక్కిపడి చూశాను.కప్పుని టీపాయ్‌ మీద ఉంచి వంటింట్లోకి వెళ్ళింది. చూపు మరలిస్తే .. అటువైపు -ఇంటిముందు - మనవరాలు అనూషా, మనవడు సందీప్‌ స్కూల్‌బస్‌ ఎక్కుతున్నారు.ఇటు హాల్లో .. ఆ మూలగా - నా సుపుత్రుడు ప్రసాద్‌, ఏదో వెతుక్కుంటూ అస్తిమితంగా ఉన్నాడు. నిజానికి రాత్రే గమనించాను. 

ఆఫీసు నుంచి వచ్చినప్పటి నుంచి వాడు చాలా ఆందోళన పడుతున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. పిల్లల్తో సరిగా మాట్లాడలేదు. సోఫాలో చాలాసేపు దిగాలుగా కూర్చున్నాడు. రేఖ అడిగితే ఏమీ చెప్పలేదు. ఆమె చాలాసార్లు గుర్తు చేయగా .. లేచి టిఫిన్‌ అయిందనిపించి వెళ్ళి పడుకున్నాడు.ఒకరాత్రి వేళ నిద్ర మెలకువ వచ్చి, నేను హాల్‌లోకి వచ్చి చూస్తే - వాడు ల్యాప్‌టాప్‌లో నిమగ్నమై ఉన్నాడు. నాకు తెలుసు. ఆఫీసు పని బాగా బిజీగా ఉంటే ఇలా అర్ధరాత్రి, అపరాత్రి లేచి పనిచేసుకుంటూ ఉంటాడు. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. కానీ చాలాసేపు నిద్రపట్టలేదు. ఎప్పటికో కునుకు తీశాను.

మళ్ళీ ఐదింటికి లేచి చూస్తే, అప్పుడే లైట్లు తీసి లోపలికి వెళ్తున్నాడు ప్రసాద్‌.‘‘రేఖా .. ఏమిటివన్నీ! ఎక్కడ చూసినా చెత్తా చెదారం, సర్దే శ్రద్ధా తీరుబడీ లేవు .. రాణీగారికి! ఎప్పుడూ బలాదూరు తిరుగుళ్ళు ...’’ హఠాత్తుగా ప్రసాద్‌ అరిచిన అరుపులకి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చాను.‘‘ఇప్పుడేమైందీ? ఏం కావాలి మీకు?’’ రేఖ వచ్చింది.‘‘ఏం కావాలి?’’ వెటకారంగా, ముఖకవళికలు మార్చుతూ ‘‘ప్రశ్న మాత్రం తయారు.. కావాలన్నా దొరికి చస్తుందా?’’ ఠక్కున ఆమెవైపు తిరిగి ‘‘ఛీ’’ అని చీత్కారం చేశాడు.నాకు మనసు చివుక్కుమంది. రేఖ మాత్రం ఎంతో నిగ్రహంతో ఏమీ వినపడని పలుకులతో పెదవులు కదల్చి, తల విదిలించింది. ‘‘ఊరికే అరవక చెప్పండి ప్లీజ్‌’’ అన్నది.సహనం ఎంత బరువైందో ఆమె మాటల్లోని మార్దవం చెబుతోంది!