రైలు ఎక్కింది కాంచన. ఎదురుగా అందమైన అమ్మాయి. ఎంతో పొందికగా కూర్చుని చక్కగా పుస్తకం చదువుకుంటోంది. ఆమెను పరిచయం చేసుకోవాలని తహతహలాడి మాట కలిపే ప్రయత్నం చేసింది కాంచన. కానీ సాధ్యపడలేదు . అహంకారిలా లేదు, కట్టూ బొట్టూ తెలుగమ్మాయిలానే ఉంది. మరేంటబ్బా! అనుకుని ఆమె చేతిలో పుస్తకం లాక్కునేందుకు తెగించింది కాంచన ! తర్వాత ఏమైంది?

రైలు మెల్లగా కదిలి క్రమంగా వేగం పెంచుకుంటోంది. తన లగేజి మరోసారి చెక్‌ చేసుకొని విండో పక్కన సీట్లో కూర్చుంటూ ఎదురుగా కూర్చున్న యువతివైపు చూసింది కాంచన. సన్నగా, పొడుగ్గా, నాజూకుగా ఉంది. గోధుమరంగు ఛాయ, మోములో చంద్రకాంతి ఆమెనిట్టే ఆకర్షించాయి.విశాల నయనాలు, గులాబీరంగు పెదవులపై సహజమైన చిరునవ్వుతో చక్కని ఆర్గండీచీరలో హుందాగా ఉంది.కాంచన ఆమెని పరిచయం చేసుకోవాలనుకుంది.ఆమె మాత్రం సీరియస్‌గా పుస్తకం చదువుకుంటోంది. దాంతో డిస్టర్బ్‌ చేయాలనిపించలేదు.అయిదుగంటల నిరంతర ప్రయాణం.

ప్రయాణంలో ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చోవడం తనకి అలవాటులేదు. ఇద్దరు ఆడవాళ్ళు గలగలా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చటించుకుంటూ కలిసి ప్రయాణించడమంటే తనకెంతో ఇష్టం. అర్జెంటుగా పుట్టింట్లో పని బడి ఒంటరిగా బయలుదేరిందితప్ప ఆయనగానీ, పిల్లలుగానీ వెంట లేనిదే తానెక్కడికి వెళ్ళదు.ప్రయాణంలో ఎందరో వ్యక్తులు ఎదురవుతారు. కొందరు పరిచయమవుతారు. కొందరి పరిచయం పెరిగి పెద్దదై స్నేహితులవుతారు. కొందరు మాటలమధ్యలో బీరకాయపీచు బంధుత్వమేదో కలిపి తామూ బంధువులై పోతారు.

అయినా ఇద్దరు ఆడవాళ్ళ మధ్య పరిచయం పెరగటానికి ఏమంత సమయం పట్టదు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. రైలు కదిలి అరగంట గడిచినా ఇద్దరిమధ్యా ఒక్కమాట కూడా పొర్లలేదు. అసలు ఆ యువతి తనని చూసినట్టు లేదు.ఆమె సంగతి సరే, తానైనా ముందు మాట్లాడి పరిచయం చేసుకోవచ్చుగా. ఈ పిల్లధోరణి చూస్తే ఎవరితోనూ మాట్లాడేలా లేదు. ఒకవేళ అహంకారమా? అనుకుంటే మనిషి అలా కనిపించటం లేదు. పరభాషా పిల్ల కాదు. అచ్ఛమైన తెలుగమ్మాయేనని కట్టూ బొట్టూ స్పష్టం చేస్తున్నాయి.