మహానగరంలో రణగొణ ధ్వనులకూ, ట్రాఫిక్‌ భయభ్రాంతులకూ, నగరవాసుల నిర్లక్ష్యచేష్టలకూ అలవాటుపడిన ఆ మహానుభావుడి జీవితం ఆకస్మికంగా నందనవన విహారంగా మారిపోయింది. ఎక్కడా శబ్దకాలుష్యం, కోపతాపాలు, ర్యాష్‌ డ్రైవింగులూ లేవు. ఆఫీసులో లొడలొడవాగే కొలీగులు బుద్ధిగా పనులు చేసుకుంటున్నారు. ప్రపంచం ఒక్కసారిగా ఎందుకింత కాలుష్యరహితంగా మారిపోయింది! అసలేంజరిగింది?

హంసతూలికాతల్పంమీద పవ్వళించినట్టుగా ఉంది. ఎంతో హాయిగా ఉంది. ఆనందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఎక్కడినుంచో మృదుమధురసంగీతం అల్లనల్లనగాలిలో తేలివస్తోంది. మనస్సులో మల్లెలమాలల్ని ఊగిస్తోంది.ఎన్నడూ అనుభవంలోకిరాని సరికొత్త అనుభూతి, కొంగ్రొత్త ఆనందం నన్నుచుట్టుముట్టి ఊపేస్తున్నాయి.పెదాలమీద మందహాసం సితార మీటినట్లు కదుల్తోంటే, పంచేంద్రియాలూ ‘తెరచి’ చూశాను.అదే గది. అదే మంచం, అయినా ఏదో పెనుమార్పు నాకు తెలుస్తూనే ఉంది.సీలింగ్‌ఫ్యాన్‌ వంక చూశాను. వయ్యారంగా తిరుగుతోంది. ఎలాంటి కరకర భీకర చప్పుడూ చెయ్యట్లేదు.అలారాన్ని చూశాను. టైము ఆరు గంటలు. చిత్రం. అది కుయ్యోమొర్యో అని మొరగటంలేదు. తపస్సమాధిలో ఉన్నట్టుంది.

అయినా, సరైనసమయానికి మెలకువ వచ్చింది. ఏదో సిక్త్‌సెన్స్‌ మేల్కొలిపినట్టు.గదిలోంచి బయటికొచ్చాను.వంటింట్లోంచి రణగొణధ్వనులు వినిపించలేదు. నా శ్రీమతి చిందులుతొక్కుతూ కథాకళి ఆడటంలేదు.పనిమనిషి రాకపోతే లేదా రావటం ఆలస్యమైతే మాఆవిడ ‘కదం’ తొక్కుతుంది. ఆమెనీ ఆమె విశ్వాసహీనతని ఎడాపెడా ఎండగట్టేస్తుంది. సరిగ్గా అదేసమయంలో కుళాయి నీళ్ళొచ్చాయా ఇహ చెప్పనే అక్కర్లేదు. మిన్నూమన్నూ ఏకమైపోతాయి!‘‘హాయ్‌’’ శ్రీమతిని పలకరించాను.బదులుగా చిన్నగా నవ్వింది. ‘‘మొహం కడుక్కోండి. తేనె, నిమ్మకాయనీళ్ళు రెడీ చేస్తాను’’.ఇంతచక్కగా శాంతంగా చెప్పింది నా ఇల్లాలేనా? అయ్యుండదు.

ఎవరైనా ఆమెలోకి పరకాయ ప్రవేశం చేశారేమో!ఆమెవంక అనుమానంగా చూశాను.‘‘ఇహ ఇవాళ్టినుంచి ఇలాగే ఉంటాను. నో చిర్రులూ నో బుర్రులూ!’’ కనురెప్పలార్పి నవ్వింది.ఆ నవ్వు ఎంత మనోజ్ఞంగా ఉంది!‘‘వావ్‌, ఇలాంటి ఉదయం ఎన్నడూ చూడలేదు. దీన్నే శుభోదయం అంటారు కాబోలు. నాకు చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంది డియర్‌!’’తనురోజూ ఇలా ఉంటే నేను ‘ఏవైనా సాధించొచ్చు. ఎన్నైనా సాధించొచ్చు’ అని బలంగా అనిపించింది.బాత్‌రూంలోంచి బయటపడ్డాక కూడా బాత్‌రూం పాట హమ్‌ చేస్తూ రెడీ అయ్యాను.శ్రీమతికి చిన్న ముద్దుతో వీడ్కోలుచెప్పి, ఇంట్లోంచి బయటపడ్డాను.