మీ అయ్యగారి పుట్టినరోజు, సేమ్యా చేశాను తిని వెళ్ళు అంటూ గిన్నెతో ఇచ్చింది ఆ ఇంటావిడ. కానీ ఈ పనిమనిషి మాత్రం సేమ్యా తినకుండా గిన్నెమీద కొంగుకప్పి ఇంటికి తీసుకెళ్ళబోయింది. ఆ ఇంటావిడ ముఖం అప్రసన్నంగా మారింది. తీసుకెళ్ళి ఆ తాగుబోతుకి పెడతావా, వీల్లేదు, ఇక్కడే తినెళ్ళు అంది. ఎంతసెడ్డా ఆడు నా కొడుకే కదమ్మా అందామె. ఆ తల్లి ఎంతో ప్రేమగా తీసుకెళ్ళిన సేమ్యాని కొడుకు తిన్నాడా?

ఉదయం తొమ్మిదవుతోంది. పార్వతమ్మ ఇంట్లో పనులుచేస్తున్న ఆదెమ్మ, బయట నూతిగట్టుదగ్గర గిన్నెలు కడిగి, వాటిని వంటగదిలోకి తెచ్చింది. వాటిని స్టాండ్‌లో సర్దిపెట్టింది. డైనింగ్‌ టేబుల్‌మీద ఎంగిలి టీ కప్పులు తీసి సింక్‌లో కడిగి వాటిని షెల్ఫ్‌లో పెట్టింది. తర్వాత బయట నూతిగట్టు చుట్టూ శుభ్రంగా కడిగింది. అంతటితో ఆ పూట పనైపోయింది ఆదెమ్మకు.‘‘అమ్మగోరూ పనైపోనాదండీ, నానింటికెలతాను’’ ముఖానికి పట్టిన చెమట కొంగుతో తుడుచుకుంటూ అంది ఆదెమ్మ.‘‘ఒక్క నిమిషం ఉండవే, మీ అయ్యగారి పుట్టినరోజు ఇవాళ. సేమ్యా చేశాను, తెస్తానుండు’’ లోపల నుండే అరచింది పార్వతమ్మ.ఆదెమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ‘అందుకేనా, వంటగదిలో మంచి వాసనవస్తోంది’ అనుకుంది మనసులో.పార్వతమ్మ గిన్నెతో సేమ్మా తీసుకొని బయటకు వచ్చింది.

ఎరుపురంగు పట్టుచీరలో ప్రసన్నవదనంతో ఉన్న పార్వతమ్మ అచ్చం లక్ష్మీదేవిలా కనిపించింది ఆదెమ్మ కళ్ళకు.తనవంక చూసుకుందోసారి. ఎండలో వానలో పనిచేసే తనలో నాజూకుతనం ఎప్పుడో పోయింది. చిరుగుల నేతచీరలో ఒళ్ళంతా చెమటపట్టి తనకే చిరాగ్గా ఉంది. ‘తప్పదుమరి, తన బతుకే అంత’ అనుకుంది.‘‘బయటికి ఎల్తున్నారామ్మా!’’ అడిగింది ఆదెమ్మ.‘‘అవునే, ఇదిగో నీ పని అయిపోతే కోవెలకి వెళదామని అనుకున్నాం’’ చేతికి సేమ్యా గిన్నె అందిస్తూ అంది.‘‘సరే, నానెలతాను అమ్మగోరూ’’ అంటూ వెనుతిరిగింది.‘‘అదేంటే, అంత తొందరేం లేదుగానీ, ముందు తినేసివెళ్ళు’’ అంది.‘‘ఇంటికట్టుకు పోతానమ్మా! ఆడికి సేమియా అంటే ఇష్టం’’‘‘ఎవడికే, నీ కొడుక్కా...’’ పార్వతమ్మ ముఖం అప్రసన్నంగా మారిపోయింది.‘‘ఈ వయసులో నిన్ను సుఖపెట్టాల్సినవాడు, నీ సంపాదనంతా లాక్కుంటున్నాడు. ఆ తాగుబోతు కొడుక్కి పెడతావా’’ అసహనంగా అంది.