అదొక మారుమూల పల్లెటూరు. కానీ ఇప్పుడు ఆ ఊరుపేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. జనం ఆ ఊరు గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియాలో వార్తలన్నీ ఆ ఊరు గురించే. గిన్ని్స్‌ రికార్డుల్లోకి ఎక్కడానికి సిద్ధంగా ఉందా ఊరు. ప్రధానమంత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అంతటి గొప్ప సందర్భం రానే వచ్చింది. ప్రపంచాన్ని అబ్బురపరచే ఓ మహాద్భుతం ఆఊళ్ళో ఆవిష్కృతమైంది. అంతగా ఉత్కంఠ రేపిన ఆ అద్బుతం ఏమిటి?

‘‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యాము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడూ....’’వీనులవిందుచేస్తూ అన్నమాచార్యకీర్తన గాయకురాలికంఠం నుండి చక్కటి శృతిలో వినబడుతోంది. పాటకి అనుగుణంగా వినిపించే నేపథ్య సంగీతంలోని లయను అనుసరిస్తూ చిన్నారులపాదాలు చకచక కదులుతున్నాయి. ఊరుచివర ఆశ్రమంలా ఉండే ఆ ప్రాంగణం కూచిపూడి నృత్యానికి ప్రపంచ ప్రఖ్యాతి తెస్తుందని ఎవరూ ఊహించలేదు.నర్తనశాలలో నటరాజవిగ్రహం ముందు సుమారు వందమంది పిల్లలు ఒకేసారి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ ఆ ప్రాంగణానికి ప్రాణం పోశారు. చుట్టూ మంచి మంచి పూలమొక్కలు, మధ్యలో తాటాకు పర్ణశాల నిర్మాణాలూ, అతిథులకు ప్రత్యేకగృహం, అక్కడే ఉండిపోయే పిల్లలకూ, శిక్షకులకూ వసతీ, భోజనసదుపాయాలూ, ఇవన్నీ చూసుకునేందుకు పనివాళ్ళూ, సకల సదుపాయాలతో ‘కళారంజని’ ఆ గ్రామంలో అమరడానికి ప్రత్యేకకారణం మాత్రం ‘అమృత’‘అమృతా మేడమ్‌’! అని అందరూ ఆప్యాయంగా పిలిచే ఆమె పూర్తిపేరు అమృతవర్షిణి అని శిలాఫలకంపైన, ఆ కార్డులలోనూ ఉంటుంది.

అసలుపేరు ఏమిటో తెలుసా? బహుశా ఆమెకే తెలిసి ఉండాలి.ఐదుపదుల వయసుండే అమృత ఈ కళారంజని అకాడమీ వ్యవస్థాపకురాలు. కూచిపూడి ప్రదర్శనతో ప్రపంచం మొత్తం చుట్టివచ్చింది. పద్మవిభూషణ్‌ ప్రభుత్వ పురస్కారం పొంది ఆ గ్రామానికి గుర్తింపు తెచ్చింది అమృత.కూచిపూడి నృత్యోత్సవం కన్నులపండువగా జరిగినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, విశిష్ట అతిథులుగా విచ్చేసి ఆ గ్రామాన్ని ప్రపంచంముందు ప్రదర్శనకు ఉంచిన సంగతి ఊరు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఒబామా భారతదేశపర్యటనకు వచ్చినప్పుడుకూడా, సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం ఇక్కడినుంచి ఒక ప్రత్యేకబృందాన్ని పంపించారంటే ‘కళారంజని సమాఖ్య’ ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు.ఒకప్పుడు అది సీదాసాదా పల్లెటూరు. కానీ నృత్యకళాకారిణిగా విశిష్టమైనస్థానం పొందినతర్వాత, అమృతవర్షిణికి ప్రభుత్వం ఒక బాధ్యత అప్పగిస్తూ కొంతధనం, స్థలం అవసరమైన వనరులూ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆమె చేయాల్సిందల్లా, సంవత్సరానికి ఐదువందలమంది చిన్నారులను నృత్యకళాకారిణులుగా తయారుచేయడమే. అందుకోసం ఏర్పాటుచేసిన అకాడమీకి అమృత ఛైర్‌పర్సన్‌.