లంచం ఇవ్వనిదే ఫైలు కదలదంటున్నాడు ఆ అధికారి. ససేమిరా ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటున్నాడు ఆ నిజాయితీపరుడు! ఎ.సి.బి అధికారులకు ఫిర్యాదుచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిస్తానని హెచ్చరించినా బెదరడంలేదు ఆ అధికారి. మొండివాడు రాజుకన్నా బలవంతుడని మరచిపోకు అని ప్రతిసవాలు చేస్తున్నాడు. ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళ మధ్య నీతి గెలిచిందా? అవినీతి గెలిచిందా?

‘శ్రీ అజిత్‌రావుగారూ! మీకిది భావ్యంకాదు. ప్రభుత్వం ఇచ్చే వేలకు వేలు జీతాలు సరిపోవడం లేదా! మాలాంటి అమాయకుల వెంటపడి లంచాలంటూ పీక్కుతింటూ అవినీతికి పాల్పడుతున్నారు..?’ తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు దామోదర్‌.‘‘నువ్విచ్చే డబ్బుల్తో ప్యాలెస్‌ ఒకటి కట్టుకుందామని..’’వెటకారంగా నవ్వుతూ బదులిచ్చాడు అజిత్‌రావు.‘‘పదివేలు ఇస్తేనే నీ పని అవుతుంది’’ పదేపదే అంటున్నాడిదే మాట.దామోదర్‌కి రుచించడంలేదు. రుచించనిది ఆఫీసర్‌చెప్పిన అంకెకాదు. అతను లంచం అడగడం నచ్చడంలేదు.‘‘మన కరీంనగర్‌జిల్లా ఏసీబీ డిఎస్పీగారు యమస్రిక్టుగా ఉన్నారు. ఆయన్తో ఒకసారి ఫోన్లోమాట్లాడి మిమ్మల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టిస్తాను’’ బెదిరింపు అస్త్రం ప్రయోగించాడు దామోదర్‌.

‘‘నాకు రెడీక్యాష్‌ హ్యాండోవర్‌ చేయమంటే, రెడ్‌హాండెడ్‌గా పట్టిస్తానంటావేం..?’’ అన్నాడతను మొండిగా. ‘‘మొండివాడు రాజుకన్న బలవంతుడట’’ విసుగు ధ్వనించింది దామోదర్‌ గొంతులో.‘‘లంచగొండి మొండివాడికన్నా బలవంతుడు’’ సెటైర్‌ విసిరాడు అజిత్‌రావు.‘‘అందుకేమరి మొండితనం ఒంటికి మంచిదికాదు, లంచగొండితనం ఉద్యోగానికి పనికిరాదు’’ మాటకుమాట సంధించాడు దామోదర్‌.‘‘పదీపరకా,వేలు లంచమడిగితేనే ప్రపంచమంతా మునిగిపోయినట్లు తల్లడిల్లిపోతున్నావే? కుంభకోణాలపేరిట వేలకివేలకోట్లు మెక్కేస్తున్న బడాబాబులగురించి నీలాంటి ఉత్తమపౌరులు ధర్నాలు, రాస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడిలు ఎందుకుచేయరు?’’ లాజిక్‌ లాగాడు.

‘‘మనమధ్య జరిగిన సంభాషణ రికార్డు చేశాను. ఏసీబీ ముందుపెట్టి మీ బాగోతం వినిపిస్తే అప్పుడు పైత్యం వదిలిపోతుంది’’ కసిగా అన్నాడు దామోదర్‌. ‘‘ఎవరైనా అంబాడుతున్న పిల్లవాడుంటే వెళ్ళి వాడికి చెప్పు ఈ కథలు’’ నిర్లక్ష్యంగా బదులిచ్చాడు అజిత్‌రావు.‘వీడేంట్రాబాబూ! దేనికీ లొంగడంలేదు, కొంచెంకూడా బెదరడంలేదు, బాగా ముదిరిపోయినట్టున్నాడు! లంచగొండిల యూనియన్‌ గనక ఏర్పాటుచేస్తే వీడుతప్ప మరొకడు అధ్యక్షునిగా పనికిరారు. నో డౌట్‌!’ మనసులోనే తిట్టుకున్నాడు దామోదర్‌.‘‘నీటిలోఉండే చేప నీళ్ళుతాగకుండా ఎలాఉండలేదో అదేవిధంగా ఓ ఉద్యోగికూడా లంచంముట్టకుండా ఉండలేడు. ఇది ఏనాడో కౌటిల్యుడు సెలవిచ్చినమాట’’ అంటూ పకపకా నవ్వాడు అజిత్‌రావు.