తల్లిమాట జవదాటన పిల్లాడు అతను. కానీ సవతితల్లి అతడిని ఎన్నో బాధలు పెట్టేది. ఒకసారి ఆ కుర్రవాడు చింతచెట్టుదగ్గరకు వెళ్ళాడు. అక్కడో పెద్దకప్ప కనిపించిందతనికి. నిజానికి అది కప్పలన్నిటికీ రాజు. ఆ కప్ప మానవభాషలో మాట్లాడి ఆ కుర్రాడికి వరాలు కురిపించింది. ఎన్ని వరాలిచ్చినా ఆ కుర్రవాడు మళ్ళీమళ్ళీ కప్పలరాజును వరాలు కోరుతూనే ఉన్నాడు.. చివరకు కప్పలరాజు ఏం చేసింది? అసలాకుర్రాడికి కావాల్సిందేమిటి?

ఒకానొక గ్రామంలో గోవిందుడు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లి పోవడంవలన తండ్రి రెండోపెళ్ళి చేసుకున్నాడు. సవతితల్లికి గోవిందుడు అంటే పడేదికాదు. అతడిని అష్టకష్టాలు పెట్టేది. గోవిందుడికి ఓర్పు ఎక్కువ. అతడు అన్ని కష్టాలూ భరించడమే కాక దేనికీ సవతితల్లిని తప్పుపట్టేవాడుకాదు. ఆమెను కన్నతల్లిగానే భావించి సేవలు చేసేవాడు. గోవిందుడికి తీరని కోరికంటూ ఉంటే అది ఒక్కటే, అదే చదువు. తనను బడికి పంపమనీ, చదువు చెప్పించమనీ గోవిందుడు రోజూ సవతితల్లిని వేధిస్తూ ఉండేవాడు.‘‘నీ తండ్రి పొలంపనికి పోతాడు. నాకేమో ఇంటినిండా పని. ఏదైనా సాయం కావలసి వస్తే నాకెవరుంటారు? అంతేకాక, బడికి పంపాలంటే ఖర్చుతో కూడుకున్నపని. మనకంత డబ్బు లేదు’’ అని గోవిందుడిని మందలించేది సవతితల్లి.

అయినా, గోవిందుడు రోజుకొకసారైనా ఆమెను చదువుకుంటానని అడిగి తిట్లు తింటూండేవాడు.ఒకరోజు గోవిందుడు చింతచిగురు కోయడానికి ఊరిచివరకు వెళ్లాడు. అప్పుడు అతడు చింతచెట్టుక్రింద ఒక పెద్దకప్పను చూశాడు. అంతపెద్ద కప్పను అతడు జీవితంలో చూసి ఎరుగడు. చెట్టెక్కటానికి అడ్డుగా ఉన్నదని గోవిందుడు ఆ కప్పని ఆదిలించాడు. అప్పుడా కప్ప మానవభాషలో, ‘‘నేను నీ జోలికి రాలేదు. నా పనిలో నేనున్నాను. అలాంటప్పుడు నన్ను ఎందుకు అదిలించావు’’ అని అడిగింది. ‘‘నేను చింతచెట్టుఎక్కి, చిగురుకోసి మా అమ్మకు ఇవ్వాలి. అడ్డుగా ఉన్నావని నిన్ను అదిలించాను’’ అన్నాడు గోవిందుడు.

‘‘అంతేనా! అయితే, నువ్వు కూడా తెచ్చుకున్నగుడ్డ నేలమీద పరిచి ఉంచి కళ్ళు మూసుకో. నేను చెప్పగానే కళ్ళు తెరు’’ అన్నది కప్ప. గోవిందుడు అలాగే చేశాడు. కనులు తెరచేసరికి గుడ్డనిండా చింత చిగురు ఉన్నది. ఆశ్చర్యపడుతూనే దాన్ని మూటకట్టుకున్న గోవిందుడు, ‘‘ఇదంతా ఎలా జరిగింది?’’ అనడిగాడు కప్పని. ‘‘నేను మాములు కప్పను కాదు. కప్పలరాజును. నాకు ఎన్నో అద్భుతశక్తులు ఉన్నాయి’’ అన్నది కప్ప.