ఢిల్లీ కాన్ఫరెన్సుకుజగన్‌ వెళ్ళి వుండకపోయునా, జగన్‌ లేనప్పుడుప్రకాష్‌ వచ్చి వుండకపోయినాయింత కథ జరిగివుండేది గాదు.కానీ యీ కథ యెప్పుడో వొకప్పుడు జరిగే తీరుతుందనీ, ప్రకాష్‌ కేవలం కెటలిస్టు మాత్రమే అనీ అనిపిస్తూ వుంటుంది. ఢిల్లీకి నన్నూ రమ్మన్నాడు జగన్‌. ఆ కాన్ఫరెన్సులు అర్ధర్రాతి వరకూ లాగుతారు. యే అపరాత్రికో అతను హోటలు కొచ్చేవరకూ గదిలో వొంటరిగా వేగాలి. వొంటరిగాకొత్త వూర్లలో బజార్లు తిరగడంనాకు పడదు.

‘‘మీతో బాటూ యెవరొస్తున్నారు?’’ అని అడిగాను.‘‘రమేష్‌’’ అన్నాడు జగన్‌.‘‘మీకు డస్ట్‌ పడదని, మీరులేనప్పుడు యింటి బూజులు దులిపి, సర్దే పనిపెట్టుకున్నాను’’ అన్నాను.మరునాడు తెల్లవారి ఎయిర్‌పోర్టు నుంచీ ఫోను చేశాడు జగన్‌.‘‘రమేష్‌ లాస్ట్‌మినిట్‌లో రాలేనన్నాడు. ఫామిలీ ప్లానింగ్‌ ఫెయిలయింది’’ అన్నాడు. కాస్సేపాగి ‘‘వాళ్ళావిడకు నొప్పులొచ్చాయట! హాస్పిటల్‌లో వున్నానన్నాడు. ఆల్టర్‌నేట్‌గా అమిత వస్తోంది’’ అన్నాడు.‘‘ముందు జాగ్రత్తగా అన్నీ సిద్ధం చేసుకునే వున్నారు.’’‘‘అదేం లేదు సుజాతా. నువ్వొచ్చివుంటే బావుండేది. వొంటరిగా, పరాయి స్త్రీతో బాటూ...’’ జగన్‌ గొంతులో బాధ స్పష్టంగానే ధ్వనిస్తోంది. కానీ యిలావెళ్ళడం తొలిసారి గాదు. ఆఫీసు పనులు, చాలామంది ఆడ కొలీగ్స్‌, యెప్పుడూ సెమినార్లూ, కాన్ఫరెన్సులూ, బిజినెస్‌ ట్రిప్పులూ.. నాకేమూలో అనుమానముందని జగన్‌ పసిగడతాడని ఆదుర్దా.‘‘స్నేహం వరకైతే వోకే. సహజీవనానికీ, సంసారానికీ వేరే యీక్వేషన్లుంటాయి.

మనకే తెలియనివీ, సబ్‌కాన్షష్‌లో దాగుండేవీ. వొక వ్యక్తిపైన గొప్ప ప్రేమో, విపరీతమైన ద్వేషమో వుంటేనే అటువంటి వ్యక్తిపైన అలాంటి కోరిక పుడుతుందని మానసిక శాస్త్రవేత్త యెవడో చెప్పాడు. నాకు యితరుల పైన అంత ద్వేషమేదీ వుండదని నీకు తెలుసు. యిక ప్రేమ యెందుకు పుడుతుందో నాకే తెలియదు’’ అన్నాడు జగన్‌ వోసారి.తెల్లవారుతూనే సూర్యుడు పుట్టేటంత సహజంగా నా జీవితంలో కొచ్చినవాడు జగన్‌. ఆగ్రాలో మా అక్కాబావల్ని చూట్టానికి రావడం యిటీవలే జరిగినట్టుగా అనిపిస్తుంది. నేనొచ్చిన రెండో రోజే జగన్‌ను డిన్నర్‌కు ఆహ్వానించారు. అలా జరిగిన పరిచయం.రెండురోజుల తర్వాత ‘‘జగన్‌ నీకు తాజ్‌ చూపిస్తానన్నాడు, వెళ్ళిరా!’’ అంది మా అక్క. తాజ్‌, తర్వాత ఫతేపూర్‌ షిక్రీ, యింకో రోజు మొగల్‌గార్డెను.. చాలా సాదాసీదాగా మరో మగాడ్ని తిప్పుతున్నట్టుగా, అన్‌ రొమాంటిక్‌గా ప్రవర్తించాడు. పది రోజుల తర్వాత, మేడపైన వరండాలో కూచున్నప్పుడు, నేను తీసుకొచ్చిన కాఫీని సగం సాసర్లోకి వంపుకుని, మిగిలిన కప్పు నాకిచ్చి, కాజువల్‌గా ప్రపోజ్‌ చేశాడు. వులిక్కిపడి తలెత్తి చూశాను. చీకట్లో అతని కళ్ళల్లో నక్షత్రాలేవో వెలుగుతున్నట్టు కనబడింది నాకు.