అర్థరాత్రిదాటి అరగంటైంది. ఓ చేత్తో జుట్టు పీక్కుంటూ, వాలిపోతున్న కళ్ళను ఎత్తి మరో చేత్తో లాప్‌టాప్‌లో టైపు చెయ్యటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు జగ్గు. కోచింగులతో కుస్తీ పడుతున్న స్టూడెంటో, స్పేస్‌లో రాకెట్‌ లాంచింగ్‌ గురించి బుర్రబద్ధలు కొట్టుకునే సైన్టిస్టో కాదతను! కథ రాయాలని కుస్తీపడుతున్న కుర్రోడు. జగదీషు నామధేయుడు. ముద్దు పేరు జగ్గు.

జగ్గు తన ఎఫ్‌.బి. వాల్‌మీద (ముఖ పుస్తకం గోడ మీద) గల్లీల్లో తగువుల దగ్గర నుండి సినిమాహాల్లో చిప్స్‌ పాకెట్స్‌ వరకు, ప్రక్కింట్లో పోట్లాటల దగ్గరనుండి రాజకీయ రచల వరకు ఏదో ఒక అంశంమీద రోజూ ఎడాపెడా ఫేస్‌బుక్‌లో రైట్‌అప్‌లు రాయటం మొదలెట్టాడు. వాటికి తెగ లైకులు రావటంతో చివరకు అది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కి దారితీసి అర్జంట్‌గా ఫుల్‌ఫెడ్జ్‌ కథ రాసిపారేసి అచ్చులో తన పేరు చూసుకోవాలని డిసైడైపోయాడు.‘కథ అంటే అలఓకగా లాప్‌టాప్‌లో బాదెయ్యటమేగా’ అని కూర్చుని టైపు చెయ్యటం మొదలెట్టాడు. లాప్‌టాప్‌లో డెస్క్‌ అంతా రకరకాల టైటిల్స్‌తో పిచ్చిపిచ్చిగా నిండిపోతోంది. రీసైకిల్‌ బిన్‌ రిజెక్ట్‌ చేసేస్థాయకి పొంగి పొర్లుతోంది. కాని అతనికి మటుకు ఒక్క కథ కూడా కుదరటం లేదు.

ఎఫ్‌.బి., వాట్స్‌ప్‌లలో పావుపావు వాక్యాలతో, అరకొర పదాలతో, మరీ బద్ధకమైతే, ‘ఎమోజీలతో’ శభాష్‌ అనిపించుకోవటమంత ఈజీకాదు కథ రాయటం అంటే అని అర్థమైపోయింది. అట్లాగని జగ్గు మడమ తిప్పదల్చుకోలేదు.రాసి రాసి పిచ్చి పీక్‌కు చేరుతోందిగానీ, కథైతేమాత్రం కుదురుకోవటంలేదు. ఇప్పుడుకూడా ఆ ప్రయత్నంలోనే నానా అవస్థపడుతూ సోలిపోతున్నాడు.***ఆరువారాల నుండి కథ కోసం అలుపెరగని పోరాటం చేసిన జగ్గు నిద్ర లేచిన దగ్గర నుండి తన కథ కుదరక పోవటానికి కారణాల గురించి తెగ ఆలోచిస్తున్నాడు. ఆలోచనా మథనంలో నిమగ్నమైపోయాడు.