ముహూర్త ఘడియలు దగ్గర పడుతున్న పెళ్లి పందిరిలాగా ఉంది. అగ్రహారం వీధి. వీధినడిమధ్యలోని కంచినాదంవారి గుమ్మంలో అయితే మరీనూ. ఇంటిపెద్ద వెంకటనరసమ్మ హడావిడీ, ఆర్భాటం అంతా ఇంతా కాదు. పెద్దావిడ గొంతు మామూలు గానే ఖణేల్ మంటూ బెలగాం సెంటర్ నుంచి ఈశ్వరుడి కోవెల మలుపు దాకా వినిపిస్తుంది. ఇక సంబరాలవేళ సాధారణంగా ఉంటుందా? వీధి జనం ఆనందమంతా ఒక్క వెంకట నరసమ్మ మొహంలో కనిపిస్తోందా ఉదయం!

ఎప్పటిలాగే ఆ రోజు కూడా కంచినాదం వెంకట నరసమ్మ పెందరాళే లేచింది. పెరట్లో నుయ్యి దగ్గర స్నానం చేసి, తెల్లటి తడి పంచె పిండుకుని, వంటింటి వసారాకి దగ్గరగా వాకిట్లో తులసి కోట దగ్గర తాడు మీద ఆరేసుకుంది. వంటింటి అటకమీదున్న పొడి పంచె కట్టుకుని, గూట్లో విభూతిపండు మీద అరచేతిని రుద్ది, ఈ కొస నుంచి ఆ కొసకి నొసటిమీద నాలుగువేళ్ళూ పడేలా నామం పెట్టుకుంది. తులసమ్మకి నీళ్ళు పోసి, ‘‘తండ్రీ అరసవిల్లి సూర్నారాయణ మూర్తీ..’’ అంటూ సూర్యుడికి దండం పెట్టుకుంది.బొగ్గుల కుంపటి రాజేసి, గబగబా మడి వంట ముగించుకుంది. ముందువాటాలో కూతురు, అల్లుడు వాళ్ళ కుటుంబం ఉంటున్నారు.

అల్లుడు అయలసోమయాజుల ఉమామహేశం దేవీ ఉపాసకుడు. మడిగట్టుకుని అమ్మవారికి కుంకుమార్చన చేసి, జపం చేసుకుంటున్నాడు. కాసేపుపోతే ఆయన దగ్గరకు ప్రశ్నలు అడిగే వాళ్ళు వస్తారు. అరవయ్యేళ్ళనాటి ఆ రోజుల్లో ఉదయం తొమ్మిదినుంచి పదకొండు గంటల మధ్య ఆయన దగ్గరకి చాలామంది వచ్చేవారు. తప్పిపోయిన మనుషుల గురించి, పశువుల గురించి, కోర్టులో నడుస్తున్న కేసుల గురించి, వివాహ, సంతాన యోగాలు, భార్యా భర్తల సమస్యలు, ఆస్తుల తగాదాలు లాంటి సమస్యలకు ఉమామహేశం తన ఉపాసనాబలంతో సమాధానాలు చెప్పేవాడు. పలకమీద చక్రంలాంటిది వేసి, దానిమధ్యలో ఐదుం పావలా- అంటే ఐదు రూపాయల నాలుగు అణాలు దక్షిణ పెట్టమనేవాడు. అందువల్ల అగ్రహారం వీధిలో ఆయన ‘అయిదుంపావలా పంతులు’గా పేరుపొందాడు.