నేను నడుస్తూ నడుస్తూ యధాలాపంగా అటువైపు చూశాను.కిటికీలోంచి నన్నే చూస్తున్న ఓ ముస్లిం వనిత, నేను ఆమె వైపు చూడగానే, కిటికీ రెక్కని శబ్దం వచ్చేలా విసురుగా మూసివేసింది. దూరంగా కనిపిస్తున్న మరో యువతి నన్ను చీదరించుకున్నట్లుగా మొహం పెట్టి తన నిరసన తెలియచేస్తూ కాండ్రించి నేలపై ఉమ్మేసింది.ఇలాంటి అనుభవాలు నాకు మాత్రమే కాదు, సైన్యంలో పనిచేస్తున్న నాలాంటి మరికొందరకు, మా షిక్రీత గ్రామప్రజలకు అతి మామూలే... మా పై వారికి అకారణమైన శత్రుత్వం, కారణం మేం పొరుగు(శత్రు) దేశానికి సంబంధించిన వారమై ఉండటం... భారతీయులు కావటం...

వాఘా సరిహద్దు ప్రాంతానికి, సమాంతరంగా పాతిక కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామం షిక్రీత. రెండు దేశాలకి సరిహద్దు అయిన ముళ్ళకంచెకు కనుచూపుమేర దూరంలో ఎదురెదుఉగా రెండు గ్రామాలు ఉన్నాయి. భారత భూభాగంలోని గ్రామం షిక్రీత, అటువైపు పొరుగు దేశానికి సంబంధించిన గ్రామం జోష్రీ. ఒకొక్క గ్రామంలో ముప్ఫై నలభైదాకా ఇళ్ళు ఉంటాయి. అక్కడ నివాసం ఉంటున్న ఉభయ గ్రామాల ప్రజలు కూడా ముస్లిం మతానికి చెందినవారే. కానీ నిరంతరం శత్రువుల్లా భావించుకుంటూ ఉంటారు.అది సరిహద్దు ప్రాంతం కావటం వల్ల ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితి నెలకొనే ఉంటుంది. పక్షులు కిలకిలారావాలకు బదులు తుపాకుల చప్పుళ్ళు వినిపిస్తుంటాయి. వర్షం చినుకుల్లా తూటాలు మీద పడుతుంటాయి. ఇల్లు విడిచి బయటకు వెళితే, తిరిగి వస్తామో రామో, తెలియని స్థితి. ఒకవేళ వచ్చినా, అక్కడ ఇల్లన్నది ఉంటుందో లేదో కూడా అపనమ్మకమే.

రాకెట్‌ లాంచర్లు, మందు పాతర్లు, డిటోనేటర్లు, ఆర్‌డీఎక్స్‌ పేలుళ్ళు మంగళ వాయిద్యాల్లా మారుమోగుతూ మరణమృదంగాల్ని వినిపిస్తూ ఉంటాయి. రక్తపాతాల్ని సృష్టిస్తుంటాయి.ఆర్మీ వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ని నేను. తరచూ శరీరాల్లో దిగబడుతున్న తూటాల్ని తొలగొంచాలంటే అనస్థీషియా ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి మత్తునిచ్చే డాక్టర్‌ని నేను. ఆ రెండు గ్రామాలకే కాదు రెండు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే వివాదానికి నేనే కారణభూతుణ్ణి అవుతానని ఏ కోశానా కూడా ఊహించలేదు. అలా అనుకోలేనంత మాత్రాన జరిగే సంఘటనలు జరగక మానవు కదా.