రాజ్యం పడుకుంది. తనకి క్రమం ప్రధానం. టైమంటే టైం. ఒక్క సెకను అటూయిటూ బెసగకూడదు. నన్ను క్రమంలో పెట్టానికి ఏభై ఏళ్లుగా తను చేయగలిగినదంతా చేసింది. పెట్టాననితనని తాను నమ్మించుకుందా? నేనే నమ్మించానా?తేల్చి చెప్పటం కష్టం. రాత్రి పదకొండు దాటింది.రాజ్యం అనుమతించిన పెగ్గు అయిపోయింది.పడుకోవాలి. పట్టటంలేదు.

ఆరోజు ఆదివారం కదా - పత్రికలో కథ వచ్చింది. రాసింది భవిత. తన ఫోను నంబరు ఇచ్చారు. ఫోటో వేసారు. కథ చదివాక ఫోటో పరిశీలించాను. నేనా ఫోటో తీసేనాటికి దానికి పద్దెనిమిదేళ్లు. ఆ కళ్లలో లోకంపట్ల ప్రేమ, దాన్ని అర్ధం చేసుకోవాలన్న తపన, సరిదిద్దా లన్న పట్టుదల నాకు కనిపిస్తూనే ఉంటుంది.‘‘మురిసిపోకండి. తనని వదిలేసి లోకాన్ని ప్రేమించే వాళ్లు సుఖపడిన దాఖలాలు లేవు. తన వారిని సుఖపెట్టటమనేదీ లేదు’’ అంటూ క్రమం తప్పిన మా తండ్రీ బిడ్డలని మందలిస్తుంది రాజ్యం.‘మనం సేఫ్‌ జోన్లోనే క్రమం తప్పే మనుషులం గదా’ అంది భవిత ఒకమారు కళ్లు చికిలిస్తూ. నేను దాన్ని ఆరోజు కాస్త భయంగా చూసాను.కాని ఈ కథ చదివాక ఈ ఫోటో చూస్తుంటే ఏదో తేడా మనసుకి గుచ్చుకుంటోంది. ఆ చూపులు దేనినో దాస్తున్నట్టు ఆ పెదాలు దేనినో మూస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అది సేఫ్‌ జోన్‌ దాటుతోందా? ఏ సేఫ్‌ జోన్‌? విశాలవిశ్వం నాదే నాదే అంటూనేవుండే ఆ కళ్లు నాకెప్పుడూ గర్వమే కలిగించేవి.

చంద్రం కాక మరొకరిని నాదే అంటే చేదుగా ఉంది. చేదుగా ఉందా.. భయంగా ఉందా.. భయంభయంగా మనసు ప్రశ్నించుతోంది. మరొకరిని తనదే అందా? లేక ఇది కథేనా? కథే అయితే సేఫ్‌ జోన్లో ఉన్నట్టా? మనసు మాత్రం గడి దాటవచ్చా?కథ చదవమని రాజ్యంతో అన్నాను, కాస్తంత మనసు విప్పుకుందామని. ఎప్పుడూ చెప్పే జవాబే.. ‘‘ఇంతుంటే అంత చెయ్యటమేగదా నీ కూతురి స్త్రీవాదం.. నీ కమ్యూనిజమూ.. ఉన్నదేదో ఉన్నట్టుండనియ్యొచ్చు గదా. అసలు మీ ఆలోచించే వాళ్లందర్నీ భూమ్మీదలేకుండా చేసెయ్యాలి’’ వాయించి వదిలేసింది. రాజ్యం అన్నాక అంతే, దానికి జెండర్‌ బయాస్‌ కూడా ఉండదు. క్రమం మాత్రం ఉండాలి.