లక్ష్మమ్మని అందరూ ‘లచ్చు’ అనేవాళ్ళు. కుంపటి మీద మిగలకాగి, తెట్టుకట్టిన మీగడరంగులో ఉండేది లచ్చు. చక్కదనాల పిల్లకి తలనిండా ఉంగరాలే! మెత్తగా దువ్వి పొడుగ్గా జడవేస్తే ఎంత బావుండేదో! లంగావోణీ వేసుకుంటే మరీలేతగా కనిపించేది. నిజానికి లచ్చు చిన్నదే. ముచ్చటగా ముస్తాబుచేస్తే చక్కదనాల చుక్కేగానీ పిల్ల అలా కనిపించకూడదట. అది తెలిసినవాళ్ళు జాలిపడేవారు. ‘పాపం లచ్చు’ అనుకునేవారు.

బెలగాం సెంటర్‌కి పడమటిదిక్కున అగ్రహారం వీధిలో ఇరవైఇళ్ళు దాటితే పొడుగ్గా సోలగొట్టంలాగా ఓ పూరిల్లు ఉండేది. అదే ప్లీడరు గుమస్తా సుబ్బారావుగారిల్లు. ఆయనకి ఐదుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులు, మొత్తం తొమ్మండుగురు సంతానం. కిందామీదా పడి నలుగురు ఆడపిల్లలకి ఎలాగో పెళ్ళిళ్ళు చేశాడు సుబ్బారావు. కొడుకులు చిన్నవాళ్ళు. చేతికి అందిరాలేదు. ఇల్లు గడవడం కనాకష్టంగా ఉండేది.ఒకరోజు ఉదయాన్నే సుబ్బారావు భార్య నారాయణమ్మ తన భర్తను పెరట్లోకి తీసుకెళ్ళి, ఏదోచెప్పి వలవలా ఏడ్చేసింది. సుబ్బారావు దుఃఖం ఆపుకోలేకపోయాడు. పెరట్లోని పశువులపాకలో నిట్రాటపట్టుకుని భోరుమన్నాడు. ఇంట్లోవాళ్ళంతా బిక్కచచ్చిపోయారు.

పద్నాలుగేళ్ళ రెండోకూతురు లచ్చు పెద్దమనిషయింది. ఒక సందడి లేదు, సంతోషం లేదు. పిలుపులూ, పేరంటాలూ లేనే లేవు. సుబ్బారావు ఇల్లంతా దిగులుతో నిండిపోయింది. ఏడోయేట పెళ్ళిచేసి అత్తవారింటికి పంపిస్తే పదోయేటికల్లా పసుపు, కుంకుమ పోగొట్టుకుని పుట్టింటికి చేరింది పిల్ల. ఇప్పుడు ఎదిగిందంటే ఎవరికి సంతోషం? లచ్చు భవిష్యత్తు గురించి సుబ్బారావులో ఒకటే ఆందోళన! ఆ రోజంతా పెరట్లోనిపాకలో నులకమంచానికి అడ్డంపడి ఏడ్చాడాయన. చుట్టుపక్కలవాళ్ళు ఇది విన్నారు. లచ్చుమీద జాలిపడ్డారు. పద్నాలుగేళ్ళ పిల్లకి శిరోముండనం చేయించడానికి సుబ్బారావుకి మనసొప్పలేదు. చేయించి తీరాలని ఎవరూ ఒత్తిడి చేయనూలేదు.