మారెప్ప, పొగచూరిన ఇంటికప్పుకేసే చూస్తూ కూర్చున్నాడు. చూరును తొలగించి, ఇంటికి వెల్ల వేయించుకోవాలన్న ఆలోచనకూడా అతనికి కలగడంలేదు. కారణం? అతని మనసులో గూడుకట్టుకున్న నిర్వేదం. మూన్నేళ్ళక్రితం భార్య రాములమ్మ చనిపోయింది. అంతకుమునుపే ఉన్న ఒక్కగానొక్కకొడుకు కూడా పోయాడు. ఏమిటీ మనుషులు? ఏమీటీ జీవితం? అన్న ఆలోచనలు అతన్ని నిత్యం వెంటాడుతున్నాయి.

ఇక మారెప్పగురించి చెప్పుకోవాలంటే, నలభైఏళ్ళక్రితం అతను పుట్టిపెరిగిన గ్రామాన్ని వదిలేశాడు. వదిలేశాడు అనడంకంటే వదిలించారు అనటం బాగుంటుంది.మారెప్ప తన తల్లిదండ్రులతోపాటు రైతుల పొలాల్లోకి కూలీకి వెళ్ళేవాడు. తమ లాగే పొలంపనులకు వచ్చే వెంకయ్య కూతురు భవానికి, తనకుమధ్య స్నేహం పెరగటం, అది ప్రేమగా మారటం, ఈ విషయం తెలిసిన వెంకయ్య ఘర్షణకు దిగడం, అదికాస్తా చివరికి గ్రామ పంచాయతీ చావిడి వరకూ వెళ్ళడం వరకూ పరిస్థితులు దారితీశాయి.గ్రామ పెద్దలు పంచాయతీ చేసి, మారెప్పను దోషిగా నిర్థారించారు. గ్రామ బహిష్కారం చేశారు.గ్రామాల్లో కులజాడ్యం ఎంతగా పాతుకుపోయిందో, కట్టుబాట్లుమీరితే, వ్యక్తులు ఎంతకైనా ఎలా తెగిస్తారో స్వయంగా తెలిసొచ్చింది మారెప్ప కుటుంబానికి.‘‘ఇద్దరం కూలోల్లమే అయినా ఈ కులాల పట్టింపు లేమిటి?’’ అనుకొన్న మారెప్పకు సమాధానం లభించలేదు.

‘‘ఇదింతే!’’ అన్నట్టుగా ప్రవర్తించారు గ్రామంలో పెద్దలు అని పిలువబడేవారు.మారెప్పతండ్రి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని శిరసావహించాడు. మారెప్పను టౌన్‌కు తీసుకుపోయాడు. మామ వరసైన తన బంధువు చెన్నయ్య దగ్గర ఉంచాడు. చెన్నయ్య చెప్పులుకుట్టి జీవించేవాడు. తాను చేస్తున్న పనినే మారెప్పకూ నేర్పించాడు. పదేళ్ళ శిష్యరికం తర్వాత ఓ సెంటర్‌ చూపించి ‘‘నీ బతుకు నువ్వు బతుకు’’ అన్నాడు.