ఉలిక్కిపడ్డట్టు ‘సడెన్‌’గా లేచింది అరుణ -గదిలోని ‘జీరో బల్బ్‌’ కాంతిలోనే ఎదురుగా గోడమీదవున్న గడియారం వేపు చూసింది... సమయం ఆరు దాటుతోంది. తత్తరపాటుతో లేచి కూచుంది. ప్రతిరోజూ ఐదు గంటలకే నిద్రలేచే తను, ఈ రోజేమిటి యిలా? రాత్రి పడుకొనే సరికి 12 దాటిన విషయం గుర్తు తెచ్చుకుందామె!

ఆరేళ్ల కుమారుడికి మాత్ర వేయాల్సిన సమయం కావటం వల్ల వాడితో మాత్ర మింగించి, నిద్రపుచ్చి, తానూ నడుం వాల్చేసరికి 12 దాటి వుంటుంది - వాడికి నాలుగు రోజుల క్రితం ‘ఆస్థ్మాటిక్‌ అటాక్‌’ వచ్చింది.డాక్టర్‌ దగ్గరకు వెళ్తే ‘‘ఏం గాబరా పడాల్సిన పని లేదు - నువ్వేమీ ఆందోళన చెందవద్దు’’ అని ధైర్యం చెప్పి, ఒక సిరప్‌ బాటిలూ, రెండు రకాల మాత్రలూ యిచ్చి, వాటిని వాడాల్సిన వివరాలూ, సమయాలూ చెప్పినాడు ఆ డాక్టర్‌!నాలుగు రోజులుగా వాడిని గురించిన చింతే అరుణకు - వాడికంటే రెండేళ్లు పెద్దదైన సువర్ణ యింకా నిద్రబోతూనే వుంది.నిద్రలేచి జుట్టు సవరించుకొని, పక్కగది వేపు చూసిందామె - గదిలో దేదీప్యమానంగా లైటు వెలుగుతోంది - లేచి, గదిలోకి తొంగి చూస్తే, కంప్యూటర్‌ ముందు కూచున్న సురేష్‌ కనిపించినాడు.

ఒక భారమైన నిట్టూర్పు వెలువడిందామె ముక్కునుండి!ప్రతిరోజూ ఐదుకల్లా నిద్రలేచి, స్టవ్‌ వెలిగించి, ముందుగా పాలు కాచి యింత కాఫీ చేసుకొని తాగటం అలవాటామెకు - తర్వాత కూరలు వండటం, రైస్‌కుక్కర్లో బియ్యం కడిగి పెట్టడం, అవసరమైన పాత్రల్ని చకచకా కడిగేయటం, పిల్లల్ని లేపడం, వాళ్లను బాత్‌రూమ్‌లోకి తరమటం, నీళ్లు తోడి స్నానాలు చేయించడం, వాళ్ల దుస్తులు సిద్ధం చేయటం, వాళ్లకు టిఫిన్‌ తయారు చేయటం, వాళ్లకు కారియర్లు కట్టడం, తాను వెళ్లి స్నానం చేయటం... ఈ శ్రమంతా పిల్లల స్కూల్‌ ఆటో వచ్చేలోగా జరిగిపోవాలి.సురేష్‌ అనబడే ఆమె భర్త, కంప్యూటర్‌ ముందు నుంచి కదలటం, ‘స్మార్ట్‌ ఫోన్‌’ అందిపుచ్చుకొని, ‘మెసేజ్‌’లూ, ‘వాట్సప్‌’లూ వెదికి చూసుకోటం, వచ్చే ఫోన్లలో మునిగిపోవటమూ, ప్రతిరోజూ ఈ పనంతా కాస్తా ముందూ వెనకా జరిగే తంతే!