మందులు కొనుక్కుని షాప్‌ మెట్లు దిగుతున్న మాణిక్యాలరావుకి కుడి మోకాలులో కలుక్కు మన్నట్లనిపించి క్షణమాగాడు. వెంటనే అనిపించిందతనికి – తన వయసు తక్కువా, చిన్న పిల్లాడిలా అటు ఇటు గబగబ తిరగగలడా? చాలామందికిలా పిల్లలతో కలిసుండే అదృష్టం లేక పోవడంతోనే ఇలాంటి కష్టాలు?ఇంతలో మోకాలి నొప్పి కొద్దిగా సడలినట్లనిపించింది. హఠాత్తుగా ఇంట్లో వంటరిగా ఉన్న భార్య లక్ష్మీ గుర్తుకొచ్చిందతనికి. గబగబా మెట్లు దిగి సైకిల్‌ స్టాండ్‌ తీసాడు. ఈ సైకిల్వల్లే ఇంకా తనీమాత్రం ఆరోగ్యంనైనా ఉండగలుగుతున్నాడు! అలాంటి ఈ సైకిలి సరిగ్గా తొక్కలేక పోతున్నాడు తను! తనూ అనారోగ్యానికి దగ్గరవుతున్నాడా? ఒక్కసారి గుండె ఝల్లు మన్నట్లనిపించింది.

రకరకాల ఆలోచనల్తో సైకిలెక్కి నడిపించసాగాడు.సైకిల్‌ నెమ్మదిగా ముందుకు నడుస్తుంటే, ఆలోచనలు వేగంగా వెనక్కి పరుగెత్తసాగాయి. దేని పట్లయినా ప్రేమ పెంచుకోవడమంటే, కోరి బాధని తెచ్చుకోవడమేనేమో! తనూ, లక్ష్మి కూడా రాజుని ఎంతో ప్రేమగా పెంచారు? ఆఖరికి వాడేమిచేశాడు? తను సర్వీసులో ఉన్నప్పుడు తననందరూ ఆదరంగానే చూశారు. రిటైరైనప్పటి నుంచి ఆ ఆదరణ క్రమ క్రమంగా తరగసాగింది. తనంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కారణం...? తనకు ‘మారు’గా వస్తున్న ‘కుమారుడి’ చేతుల్లోనే తన జీవితం జాగ్రత్తగా ముగుస్తుందనుకోవడం వల్ల! కానీ లక్ష్మి ఒంటిల్లు మీద తనపట్టు క్రమంగా తగ్గిపోతుండడంతో తట్టుకోలేక పోసాగింది. అందరి ఆహార అలవాట్లను చేతుల్లో ఉంచుకుని, ఎవరికి ఏది ఎప్పుడు ఒండి పెట్టాలో తన అదుపులో ఉంచుకోవడం ఆమెకిష్టం.

దాంతో తనకి కొంత విశ్రాంతి నివ్వాలని కోడలు చూస్తుంటే, తన అధికారాన్ని లాగేసుకుంటోందని బెంగ పెట్టుకోవడం ప్రారంభించింది.హఠాత్తుగా అతనికి ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు?....’ ఆత్రేయ రాయగా, పి.బి.శ్రీనివాస్‌ పాడిన పాట గుర్తుకొచ్చింది.పెళ్లయిన తరువాత లక్ష్మి ‘మీరు కట్నం తీసుకోకపోవడం నాన్నగారికి ఆనందంతో బాటు ఇబ్బందీ కలిగించిందిట. అందుకని ఆయన నా పెళ్ళికోసం దాచిన సొమ్ముని నాకిచ్చేశారు’ అంటూ చీర మడతల్లో దాచిన నోట్ల కట్టని తీసి తనకిచ్చింది.

ఆ డబ్బుని ఇంట్లోకి వాడడం తనకిష్టం లేదు. బాంక్‌లో ఉంచినా ఏదొక సందర్భంలో దృష్టి అటు మళ్ళే అవకాశముంటుంది. అందుకని ఆ డబ్బుతో ఇంటిస్థలం కొనేశాడు. అక్కడి ఖాళీస్థలాన్ని కొందరు ఆక్రమించుకో సాగారు. ఆ భయంతో ఆఫీసులో హౌసింగ్‌లోన్‌కి ప్రయత్నించడం.... అది రావడం, ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకోవడం, తనో ఇంటివాడు కావడం జరిగిపోయింది. కళ్యాణం, కక్కేకాదు–స్వంత ఇల్లు యోగమొచ్చినా ఆగదని అర్థమైపోయింది. ఆ ఇంటి అప్పు దాదాపు సర్వీసు చివరి వరకూ వెంటాడుతూనే ఉంది.