అతనికి నామీద ఉన్నది ప్రేమో, ఇష్టమో తెలీని సందిగ్ధతలోనే ఒకసారి అతన్ని అడిగాను పెళ్ళి చేసుకుందామని. తనకి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని అందులో బానిసత్వం తప్ప స్వేచ్ఛ లేదని శశి అన్నాడు. ఇద్దరం కలిసి ఉండడానికి అయితే అభ్యంతరం లేదన్నాడు. ఆ రోజు నేనున్న అపార్ట్‌మెంట్‌ ఖాళీచేసి అతని అపార్ట్‌మెంట్‌కి వెళదామనుకున్న రోజు సామాను సర్దుకుంటుండగా అతని ఫోన్‌. ‘‘అమృతా, ఇక్కడికి రాబోయే ముందు ఇంకొక్కసారి ఆలోచించు. నీ కోసం నేను నా పాత జీవితాన్ని, పాత స్నేహితులను వదులుకోలేదు. వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం. అలా వదులుకోవాలని, నన్ను నీ ఒక్కదానికే స్వంతమనీ అనుకుంటే మాత్రం ఇక్కడికి రాకు. ఆ ఫ్రిక్షన్‌ అంతా నేను తట్టుకోలేను. నా వ్యక్తిగత జీవితం నాకుంటుందన్న హామీ ఇచ్చేటట్టయితేనే ఇక్కడి రా.’’ అన్నాడు.. ఆ తర్వాత...

************************************

చుట్టూ ఎత్తయిన వృక్షాలు. తలెత్తి చూసినా కనబడని వృక్షాగ్రాలు. వాటిని చుట్టుకుని చిత్ర విచిత్రంగా పాకి ఉయ్యాలల్లా అనిపిస్తున్న తీగలు, లతలు, వాటి చివర్ల పేరు తెలీని రంగు రంగుల చిన్న చిన్న పూలు. రకరకాల చెట్ల మూలంగా వచ్చే ఒకలాంటి అడవి వాసన. ఓవైపు ఎత్తయిన కొండలు, మరోవైపు పచ్చని లోయలు, లోయల మధ్య అక్కడక్కడ సన్నటి పాయల్లా జలప్రవాహాలు,కంటికి కనపడకుండా నేపథ్య సంగీతం అందిస్తున్న రకరకాల పిట్టలు - కాలుష్యంనిండిపోయిన సిరలు, ధమనుల్లో చేరుతున్న తాజా గాలి ...

 

విభూతి భూషణ్‌ ‘వనవాసి’లా అడవి కొద్దికొద్దిగా ఆవహిస్తున్న అనుభూతి. లౌకిక జగత్తుకు, అలౌకిక జగత్తుకు మధ్య కనపడీ కనపడని మాయామోహపు తెర.‘‘అమ్మా నన్నొక స్నాప్‌ తియ్యవా?’’ ముక్త పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.రోడ్డు పక్కనున్న తీగ ఉయ్యాలపై వనదేవతలా ముక్త. చిన్నూని కూడా తీద్దామని చూస్తే అది కనిపించలేదు.‘‘చిన్నూ ఏదిరా ముక్తా’’ ముగ్ధ కనిపించక పోవడంతో గాభరాగా అడిగాను.‘‘డాడీతోనూ, ఆంటీతోనూ కలిసి అటువైపు వెళ్ళిందమ్మా’’ రోడ్డుకి అటువైపు వున్న కాఫీ ప్లాంటేషన్‌ వైపు చూపిస్తూ చెప్పింది ముక్త. కాస్త దూరంలో చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న శశికాంత్‌, భ్రమర కనిపించారు. భ్రమర చేతిలో చిన్నూ చేయి.మారేడుమిల్లి చూడాలని ఎప్పటినుంచో కోరిక.

ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం. మాటల మధ్యలో భ్రమరతో అన్నప్పుడు ‘‘మీకెందుకు నేను ప్లాన్‌ చేస్తాను ఉండండి’’ అంది. నిజంగానే రెండు నెలల్లో ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేసేసింది. ఎప్పుడూ ‘కుదరదు, పని ఉంది’ అనే శశి కూడా ఈసారి సరే అన్నాడు. భ్రమర మహత్యం అయిండొచ్చు.‘‘ఈ ఆంటీ ఏంటమ్మా ఎప్పుడూ మనతో ఎందుకు వస్తుంది?’’ ముక్త గొంతులో దాచుకుందామన్నా దాగని విసుగు.శశి వాళ్లు వెళ్తున్న వైపు చూస్తూ మొహం చిట్లించి ముక్త అడిగిన ప్రశ్న వినిపించినా వినిపించనట్టే ఉండిపోయాను. మా వెంట భ్రమర ఎందుకు వస్తుంది.‘‘వస్తే ఏమయింది?’’‘‘భ్రమర ఆంటీ వస్తే డాడీ ఆంటీతోపాటే ఉంటాడు. ఏం కొందామన్నా గబుక్కున కనిపించడు. చెప్పేది ఏదీ వినిపించుకోడు’’ ఫిర్యాదు చేస్తున్నట్టు అంది ముక్త.