భర్తకు కాఫీకప్పు అందించి వెనుదిరిగింది భార్య. ఆమె నడచివెళుతుంటే హ్హీ...హ్హీ...హ్హీ అని విరగడి నవ్వడం మొదలెట్టాడు. ఆమె స్పందించలేదు. కానీ భర్త నవ్వుమాత్రం హైడెఫినిషన్‌ రేంజ్‌లో ఆమె చెవుల్లో మారుమోగిపోతోంది. గుర్తొచ్చినప్పుడల్లా పట్టుదల పెరిగిపోతోంది. పెళ్ళిచేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నవాడు ఇంత వ్యంగ్యంగా హేళనచేస్తాడా? చెప్తా...చెప్తా...ప్రతీకారం తీర్చుకుంటా అనుకుంది మనసులో.

‘‘హి....హ్హి..... హ్హి.....హ్హీ’’‘‘హి హ్హి.... హ్హీ... హ్హీ.... హ్హీ’’ఈ దశాబ్దపు అత్యుత్తమ వ్యంగ్యచిత్రాన్ని చూసినట్టు విరగబడినవ్విన భర్తనవ్వు, మోహన చెవుల్లో డీటీయస్‌ సౌండ్‌లా వినిపిస్తోంది. అలా నవ్వుతున్న ఆ దృశ్యం కూడా ‘హెచ్‌డీ’ (హై డెఫినిషన్‌) నాణ్యతతో కళ్ళముందు కదులుతోంది. ఏ పనిచేస్తున్నా ఆ నవ్వే మదిని తొలుస్తోంది. ఏ పనీ చేయకపోయినా ఆనవ్వే మనసుని అస్తిమితపరుస్తోంది. సృష్టిలో ఇతర అన్నిశబ్దాలూ అదృశ్యమైపోయి ‘హి హ్హీ...హ్హి....హ్హీ’ అన్న అతగాడి ఆ నవ్వొక్కటే మిగిలిపోయి, మిలియన్‌ డెసిబుల్స్‌లో వినిపిస్తోంది ఆమెకు! ఉదయం ఆరున్నరకి, వార్తాపత్రిక చదువుతూ, ‘‘మోహీ, కాఫీ పట్రావోయ్‌’’ అంటూ భార్యకు వినపడేలా కాస్తగట్టిగా అరిచి చెప్పాడు మురళీ. మోహనని ‘మోహీ’ అని కుదించి పిలుస్తుంటాడు ప్రేమగా. శంకుమార్కు ప్రింటెడ్‌ లుంగీ, బనియన్‌ ధరించి ఉన్నాడతనప్పుడు. ఉదయపునడక, జిమ్‌కువెళ్ళి వ్యాయామం..గట్రాగట్రా పెద్దగా ఏమీ చేయకపోయినా, అదృష్టవశాత్తూ బొజ్జ రాలేదతని కెందుకో. ఆహార నియమాలుకూడా ఏవీ పాటించడు.

అయినా, ‘షేపవుట్‌’ కాలేదు. ‘ఫిట్‌’గా కనిపిస్తాడు. ఒంట్లో ‘జీన్స్‌’ కరుణించి ఒళ్ళు పెరగకుండా ఉండే లక్షణం వంశపారంపర్యంగా వచ్చిందో ఏమోగానీ, ప్రత్యేక శ్రద్ధేమీ లేకున్నా శరీరబరువు అదుపులోనే ఉందన్న ‘అహం’ ఉందతనిలో. పెళ్ళికి ముందు మెరుపుతీగలా నాజూకుగా ఉండే మోహన, పెళ్ళయ్యాక బాగా ఒళ్ళు చేసేసింది. సైజ్‌ జీరోలా మరీ ‘పీల’గానూ ఉండేదికాదు, మరీలావుగాను ఉండేదికాదు అప్పట్లో. 36–24–36 అన్నవి ఫర్‌ఫెక్టు వైటల్‌ స్టాటిస్టిక్స్‌ (కొలతలు) అంటుంటారే అలా ఉండేది.చిదిమి దీపం పెట్టుకునే అందం. ఒక్కమాటలో చెప్పాలంటే బాపూబొమ్మలా ఉండేది. కానీ ఇప్పుడెందుకనో, 36–24–36 అన్న అంకెలకు ‘సామ్యవాదం’ పెరిగిపోయింది. తమ మధ్య ‘అంతరం’ ఉండకూడదనుకున్నాయి. క్రమంగా అవి 36–36–36గా మారి ‘సమానత్వం’ చాటుకున్నాయి. ఆ సమానత్వం మరింత ముందుకు సా....గి, 48–48–48గా స్థిరపడింది.