ఇది డబ్బు ప్రపంచం. డబ్బుంటే బంధువుల అవసరం ఉండదు. పెద్ద పెద్ద భవంతుల్లో, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఎవరి అవసరం లేకుండా బతికేస్తారు. మహానగరాల్లో హాయిగా బతికేస్తున్నామనుకునేవారంతా తమ ఇళ్ళల్లో, మనసు మూలల్లో కూడబెట్టుకునేది స్వార్థం, ఆత్మవంచన, అహంభావంతప్ప సంపదమాత్రంకాదు. ఆ మహానగరంలో అందరిలాగే బతికేస్తున్న ఆయన ఇదెలా తెలుసుకోగలిగాడంటే.... 

హైదరాబాద్‌లో మా బిల్డింగ్‌ కాంప్లెక్సు వాచ్‌మన్‌ సోమూమీద నాకు చాలా చిరాగ్గా ఉంది. మొదట్లో బాగానే ఉండేవాడు. ఈ మధ్యే ఏ పనీ సరిగ్గా చెయ్యట్లేదు. సరిగ్గా తుడవడు. సరిగ్గా కడగడు. సరిగ్గా బూజులు దులపడు. టైముకి బట్టలు ఇస్త్రీచేసివ్వడు. దానికితోడు ఆదివారాల్లో, పండుగరోజుల్లో అతగాడికి చుట్టాల తాకిడికూడా ఎక్కువ. మాటిమాటికీ ఆ చుట్టానికి బాగాలేదు, ఈ చుట్టానికి బాగాలేదు. ఆధార్‌కార్డు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి! అంటూ అర్థంతరంగా పశ్చిమగోదావరిజిల్లాలో తన ఊరికి వెళ్ళిపోతుంటాడు. ముందుగానే తన తరుపున ఎవరినోఒకరిని డ్యూటీలో పెడతాడు. అలా టెంపరరీగా వచ్చిన వాడి నిర్వాకం ఇంకా అధ్వాన్నంగా ఏడుస్తుంది.‘మనకెందుకీ తలనొప్పి? సోమూని పన్లోంచి తీసిపారేసి మరొకణ్ణి పెట్టుకుందామంటే, బిల్డింగ్‌ కాంప్లెక్సులో పాతికమంది ఓనర్లూ పాతికరకాల మనస్తత్వాలూ! సోమూవిషయంలో అందరినీ కలుపుకురావాలంటే నాకు చెడ్డ చిరాకు.

ఉన్నట్టుండి సోమూ రెండువారాలు మానేశాడు. పెళ్ళాంపిల్లల్తో సహా ఊరెళ్ళిపోయాడు. దాంతో అప్పటికే నాకు రెండువిధాలా కలుగుతున్న చిరాకు పతాకస్థాయికి చేరింది.సోమూమళ్ళీ డ్యూటీకొస్తే కాంప్లెక్సు సెక్రటరీగా అతన్ని ఉద్యోగంలోంచి తీసేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ సంగతే నలుగురైదుగురు ఫ్లాట్‌ ఓనర్లతో మాట్లాడి, లోకల్‌గా ఉంటున్న మరొకణ్ణిచూసి కొత్తవాచ్‌మన్‌గా పెట్టుకోడానికి రెడీ అయిపోయాను. అప్పటికిగానీ నా చిరాకు తగ్గలేదు.‘‘నావల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగిందిసారూ! క్షమించండి! తొంభైఏళ్ళ మా అమ్మమ్మ హైదరాబాదులోనే మాపెద్దమావయ్య ఇంట్లో కాలంచేసింది.

యాభై ఏళ్ళనుంచీ మా అమ్మమ్మ ఇక్కడే ఉంటోంది. అయినాగానీ, తనుపోతే, మా సొంతఊళ్ళోనే బూడిదైపోవాలనేది సారూ!మా అమ్మవైపు మా మామయ్యవాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు. అందులో రెండోమామయ్య మా సొంతఊళ్ళోనే ఉంటూ అందరికీ ఉమ్మడిగాఉన్న ఎకరంపొలం చూసుకుంటూ ఉంటాడు. మిగిలిన మా ఆరుగురుమావయ్యలూ, వాళ్ళపిల్లలూ అందరూ హైదరాబాద్‌లోనే ఇలాంటి పెద్దపెద్ద కాంప్లెక్సులకు వాచ్‌మన్లుగా ఉంటున్నారు.