నరసింహాన్ని ఐదో ఏటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపారు.నరసింహం ఆ ఊరి సర్పంచ్‌ ఏకైకసంతానం. లేకలేక కలిగిన మగపిల్లవాడు కావడంతో అట్టహాసంగా పంతులుగారిచేత అక్షరాభ్యాసం చేయించి బళ్లో వేశారు. స్కూల్లో పిల్లలందరికీ లడ్డూలు పంచిపెట్టారు.

నరసింహానికి కొత్తలాగు కొత్త చొక్కా తొడిగి ఇన్‌షర్ట్‌ వేశాక పిల్లవాడి కోరిక ప్రకారం నెక్‌టై కూడా మెడలో వేలాడ దీశారు. పిల్లాడు సంబరపడుతూ అద్దంలో పదేపదే తన ప్రతిబింబాన్ని చూసుకుని తెగమురిసిపోయి స్కూలుకు బయల్దేరాడు.ఆ ఊళ్లో ప్రభుత్వపాఠశాల తప్ప మరో బడిలేదు. అదికూడా, ప్రభుత్వం ఫండ్స్‌ ఇవ్వకపోయినాగానీ, సర్పంచ్‌ మహదేవరెడ్డి స్వంతఖర్చుతో కట్టించాడు!తన కుమారుడు నరసింహాన్ని కాన్వెంట్‌లో చదివించాలనే కోరిక మనసులో బలంగా ఉన్నాగానీ మరోమార్గం లేకపోయింది మహదేవరెడ్డికి. గ్రామంలో అలాంటి అవకా‍శం లేకపోవడం దురదృష్టం అనుకున్నాడు.ఆ కోరిక మనసులో ఉన్నందువల్లనే నరసింహానికి యూనీఫాం కుట్టించి, కాళ్ళకి బూట్లుతొడిగి, నెక్‌టై కట్టి బడికి పంపించి తన ముచ్చట తీర్చుకున్నాడు మహాదేవరెడ్డి.

పిల్లవాడు దర్జాగా నడుచుకుంటూ తండ్రి చిటికెనవేలు పట్టుకుని బడికి నడచివెడుతుంటే తల్లి సంబరపడింది. అనుచరగణం అతడి వెనకాల నడిచారు.‘‘అయ్యోరూ! మా పిల్లవాడు జాగర్త...’’ అని క్లాస్‌ టీచరుకి చెప్పి కొద్దిక్షణాలున్న తర్వాత సర్పంచ్‌ ఇంటి ముఖం పట్టాడు.‘‘ఒరే నరసింహా, నీవెంత స్టైల్‌గా కాన్వెంట్‌కెళ్లే పిల్లాడిమల్లే నీట్‌గా ఉన్నావో నీ చేతిమీదుగా అందుకున్న స్వీట్‌ లడ్డు కూడా అంతకుమించిన రుచిగా ఉందనుకో! నువ్విలా వచ్చి మొదటివరస బెంచీలో కూర్చో...’’ అన్నాడు టీచరు.తనబిడ్డని కాన్వెంటుకి పంపించి ఇంగ్లీషు మీడియంలో చదివించాలని కలలుకన్నాడు సర్పంచ్‌ మహదేవరెడ్డి. ఆ కోరిక కేవలం కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వ ప్రాథమికపాఠశాలకొచ్చే ఏ పిల్లవాడుగానీ, పిల్లలగానీ సరైన దుస్తులే లేకపోవడవవల్ల, నరసింహం వేషధారణచూసిన తోటిపిల్లలు అందరూ నోరెళ్ళబెట్టి, నరసింహం చుట్టూచేరారు. వాడిని ఆటపట్టిస్తూ వింతగా విచిత్రంగా చూడసాగారు.