ఢమ ఢమ ఢమ ... ఢమ ఢమ ఢమా ...ప్లాస్టిక్‌ రేకులతో ఉన్న ఆ ఇంటి కప్పు మీద ఒక్కసారిగా కురిసింది వాన. టిప్పర్‌ లారీ కంకర పోస్తున్నట్టురేకుల మీద పెద్ద చప్పుడు!గాఢ నిద్రలో ఉన్న సైది ఉలిక్కిపడి కళ్లు తెరిచింది.రాత్రంతా పీకలదాకా తాగి పక్కనే పడుకొన్నసైది మొగుడు మేఘా, అదేమీ పట్టనట్టుకుంభకర్ణుడిలా గురకపెట్టినిద్రపోతున్నాడు.

వానజోరు పెరిగి కరెంటు పోయింది. రేకులషెడ్డులో రాత్రంతా చీకటితో పోరాడుతున్న ఒక్క లైటు ఊపిరి ఆగిపోయింది.అది హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతం.ఖరీదైన అపార్ట్‌మెంట్ల మధ్య ఖాళీ స్థలంలో వేసిన ప్లాస్టిక్‌ రేకుల షెడ్లు అవి. కింద నేల, మూడు వైపులా గోడల్లా చుట్టిన ఇనుప రేకులు. పైన ప్లాస్టిక్‌ రేకులతో కప్పు. నిలువుగా ఇంకో రేకుతో తలుపు. అంతే! అక్కడ అలాంటి షెడ్లు వరుసగా ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఇరవై పైనే ఉన్నాయి. ఆ చుట్టుపక్కల నిర్మించే అపార్ట్‌మెంట్ల కోసం కావాల్సిన లేబర్‌ ఉండడానికి నిర్మించిన రేకుల పాకలవి.ఆకాశంలో మబ్బులు చీకటిని కావలించుకుని ఉండడంతో తెల్లవార వస్తున్నా వెలుగు జాడ కానరావడం లేదు.‘‘హే సైదీ .. నిద్ర లేసినవా.. నల్లాలు వస్తున్నయట. నీళ్లు తేనీకి పోతున్న’’ కేక వేస్తూ గబగబా పరిగెత్తింది పక్క షెడ్‌లో ఉండే కమ్లి.నీళ్ల సంగతి గుర్తుకు రాగానే షాక్‌ తగిలినట్లు గబుక్కున లేచింది సైది.

ఇంట్లో ఉన్న ఒక్క స్టీల్‌ బిందె, మరో ప్లాస్టిక్‌ బిందె తీసుకుని వేగంగా నడుచుకుంటూ బయటకు వచ్చింది.సన్నగా జల్లు పడుతూనే ఉంది. తడుస్తూనే కదిలింది. కొంచెం దూరం నడవగానే బైలుకి వచ్చినట్టు కడుపులో కలకలం అనిపించింది.‘‘ఇప్పుడు అటుపోతే నల్లాల నీళ్లు ఆగిపోతయి. తర్వాత పోవచ్చు, లేదంటే ఏ రాత్రికో పోవచ్చు’’ అని బలవంతంగా ఆపుకుంటూ గబగబా దగ్గరలోని అపార్ట్‌మెంట్ల దగ్గరకు వెళ్లింది.ఫఫఫసైదిది సూర్యాపేట దగ్గరలోని లంబాడాలు నివసించే భీమ్లా తండా. అక్కడే పుట్టి పెరిగింది. వాళ్ల అమ్మానాయనకు ఆరుగురు ఆడపిల్లల్లో ఆఖరు బిడ్డ. నానా తిప్పలుపడి అందరికి పెండ్లిళ్లు చేసి ఎవరి జాగలకు వాళ్లను సాగనంపారు. అక్కలందరికీ చుట్టుపక్కల తాండాలలోనే పెళ్లి సంబంధాలు దొరికినయి. సైదికి మాత్రం హైద్రాబాద్‌ సంబంధం వచ్చింది. మేఘా ఆటో తోలుతడు. తాండాలో అందరూ సైదికి పట్నం సంబంధం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నరు. సైది అమ్మనాయన పట్నంల బిడ్డ సుఖపడుతదని సంబరపడ్డరు.