సంధ్యవేళ! చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్కగదిలో అమ్మ, అన్నయ్యలతో సన్నగొంతుతో వాదిస్తోంది. బెడ్రూంలో గోడకు ఆనుకుని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది. కళ్ళతో చూస్తోందన్నమాటేగానీ, ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకటం లేదు. మనసు ఆలోచనా రహితమైంది. పక్కనే మంచంమీద వాసు నిద్రపోతున్నాడు. సన్నటిగురక వినిపిస్తోంది. సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది. అదృష్టవంతుడు. దూషణభూషణలకు అతీతుడు. యోగీశ్వరుడు, స్థితప్రజ్ఞుడు అనుకుంది. అమ్మగొంతు కాస్తహెచ్చింది. ఆ గొంతులో ఏడుపు కలగలిసింది.

‘‘నువ్వెందుకమ్మా ఏడవటం! చేతకానితనంతో, మొగుణ్ణి అదుపులోపెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోవటం తెలియనివారు ఏడవాలిగానీ!’’ చిన్నన్న మురళి గొంతు పైకి లేచింది.‘‘అన్యాయంగా మాట్లాడకు మురళీ. అదేం చేస్తుంది? నలుగురు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల. మనమే గారాబంగా పెంచాం. ఇంకా చదువుకుంటాను అని అది అడిగినాగానీ, ‘మంచిసంబంధం, ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు, పిల్లాడు మంచివాడు అంటున్నారందరూ’ అని దానిని ఒప్పించి పెళ్ళిచేశాం. తోచినరాతలు రాసుకునేపిల్లని, పువ్వులోను, పిట్టలోను అందాలు వెతుక్కునే పిల్లని ఇచ్చి పెళ్ళిచేసి పంపాం.

ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా? మనం అనుకున్నామా?’’ అమ్మ కంఠం కాస్త శృతి పెంచింది.‘‘ఏంటమ్మా నువ్వు? మొగుడు ఆఫీసునుండి రోజూ ఆలస్యంగా వస్తోంటే చొక్కా పట్టుకుని అడగటం చేతకాని దద్దమ్మా అది? దానీడువాళ్ళు భర్తల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడటంలేదూ? నాకేం నలుగురు అన్నలున్నారు, వాళ్ళే అన్నీ సరిచేసిపెడతారు, అన్నీ సమకూరుస్తారు అని పుట్టింటినెత్తిన కూర్చోవటంమాత్రం తెలుసాదానికి?’’ పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు. ‘‘అలా అనకురా పెదబాబూ. అది వింటే అన్నం కూడా తినదురా. అసలే అభిమానవతి అది. సెన్సిటివ్‌ పిల్లరా’’ ఈ మాటలు తనచెవిలో ఎక్కడపడతాయో అనే భయంతో గొంతునొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో, అనే మాటలు సరోజ చెవిలో పడనేపడ్డాయి.

తను వినడంకోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతోంటే, తను వినకూడదనీ, విని బాధపడకూడదనీ, అమ్మపడే తాపత్రయానికి మధ్య...అదుగో అప్పుడు వచ్చింది దుఃఖం సరోజకి. గొంతుపగిలేలా, గుండెలు బద్దలయ్యేలా ఏడుపు వచ్చిందిగానీ ఏడుపుని గొంతులోనే తొక్కిపట్టింది వదినల భయంతో! ‘అసుర సంధ్యవేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్ళు అనే సూటిపోటీ మాటలు భరించేశక్తి ఇకలేదు తనకి. వాళ్ళు ఏ తీర్పు ఇస్తారో అని ఎదురు చూడటంతప్ప ఏమీ చేయలేని అశక్తురాలు తను.