నిర్భయుడి కథ

సార్థకనామధేయుడు నిర్భయుడు. అతడికి భయం అంటే తెలియదు. యుద్ధపోటీలన్నింటిలో అతడే విజేతగా నిలిచి మహారాజు ప్రశంసలు, కానుకలు పొందాడు. మహారాజు సవాలు స్వీకరించి ఘోటకారణ్యంలో ప్రవేశించాడతడు. పులికళ్ళల్లోకి సూటిగా చూసి దాన్ని వశపరుచుకున్నాడు. అలా వీరుడని నిరూపించుకున్న నిర్భయుడు ఒక చిన్న పని మాత్రం చేయలేకపోయాడు!

ఒకానొకగ్రామంలో నిర్భయుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. దాంతో మేనమామ ఇంట పెరిగాడు నిర్భయుడు. ఆ మేనమామకు చంపకవతి అనే కూతురు ఉంది. తన కూతురును నిర్భయుడికి ఇచ్చి వివాహం చేయాలని మొదట్లో మేనమామ అనుకున్నాడు. అయితే, నిర్భయుడు చిన్నతనంనుంచి మహామొండిగా ఉండేవాడు. అతడికి భయమంటే ఏమిటో తెలియదు. అర్థరాత్రిపూటకూడా, ధైర్యంగా గ్రామ వీధుల్లో తిరిగేవాడు.అతడికి సాహసకృత్యాలంటే ఇష్టం. ఎత్తైనచెట్లు ఎక్కడం, వడిగా ప్రవహించే కొండవాగుల్లో ఈత కొట్టడం, మారుమూల గుహల్ని శోధించడం అతడికి ముఖ్యమైన సరదాలు. నిర్భయుడి ధైర్యం అంతాఇంతా కాదు. విషసర్పం ఎదురైతే, పాదంతో తొక్కి చంపేవాడుతప్ప కర్రను వాడేవాడు కాదు. అతడి గురి, చురుకుతనం కూడా అసామాన్యం.

ఆ గ్రామంలో ప్రసేనుడనే గృహస్థుడు ఉన్నాడు. ఆయన ఆ దేశపు సైన్యంలో కొంతకాలం పనిచేసి, మహావీరుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత, ఆరోగ్యం దెబ్బతినడంవల్ల, ఆ గ్రామానికివచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ స్థిరపడ్డాడు. ప్రసేనుడు నిర్భయుణ్ణి చూసి ముచ్చటపడి, రోజూ తనఇంట అతడికి యుద్ధవిద్యలు నేర్పేవాడు. నిర్భయుడు చాలా తొందరగా ఆ యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నాడు.‘‘నువ్వువెళ్ళి రాజునుకలిసి, నీ సామర్థ్యం ప్రదర్శించు. రాజుకొలువులో నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది’’ అనేవాడు ప్రసేనుడు. నిర్భయుడికి రాజధానికి వెళ్ళాలనే ఉంది. కానీ మేనమామకి ఇష్టంలేదు. ఏవో సాకులుచెప్పి నిర్భయుడిని వెళ్ళకుండా ఆపేశాడు. నిర్భయుడివల్ల ఆ గ్రామానికి చాలాసార్లు మేలు జరిగింది. ఒకసారి గ్రామంలో ఓ పొగరుబోతు ఆబోతు ప్రవేశించి విచ్చలవిడిగా తిరుగుతూంటే, నిర్భయుడు ఒంటిగా ఎదురెళ్ళి లొంగదీశాడు. మరోసారి అర్థరాత్రివేళ, ఊళ్లోకివచ్చిపడ్డ పదిమంది బందిపోటు దొంగల్ని, అతడొక్కడూ ఎదిరించి చిత్తుచేసి బంధించాడు.