రాజమండ్రిలో దిగీ దిగ్గానే మా దగ్గరికి వచ్చిన ఆటోకుర్రాడు, కోటిపల్లి బస్టాండ్‌లో బయల్దేరింది మొదలు గోదావరి సంగతులే చెబుతున్నాడు. అన్నీ తెలిసినవే. శోభాయమానంగా జరిగిన పుష్కరాల జ్ఞాపకాలు కూడా కలిపి. ఐదు నిమిషాల తర్వాత గోదావరి కనబడగానే నా మనసు ఆటో లోంచి దిగువన ఉన్న చివరి మెట్టుమీదకి వడివడిగా దిగి వెళ్లిపోయింది. పైనుంచి చివరి మెట్టుకి. పాదాలకు కెరటాలు తగిలేలా.

అటు గోదారి ... ఇటు కోటిలింగాల రేవు ... పక్కనే పందిరి మహాదేవుడు సత్రం.వరద గోదావరి చాలా ఉక్రోషంగా ఉంది. ఎర్రమట్టి కలుపుకొని కాషాయం కట్టుకుంది. ఎవరో తోసుకొస్తున్నట్టు .. ఎవర్నీ పట్టించుకోకుండా ఏదో పేద్ద పనున్నట్టు గలగలా వెళ్లిపోతోంది.సాధారణంగా ఒడ్డున కూర్చున్నానో లేదో - ఏవేవో తీపి కబుర్లు చెప్పే గోదావరి ఈసారి మాత్రం ఎందుకో ఇంతకు ముందులా అనిపించడం లేదు. ఎప్పుడూ కొత్తగా కనిపించి నులివెచ్చని గాలికెరటాలతో చుట్టేసే గోదావరి అసలు మనసుని తాకట్లేదెందుకో ... ఊళ్లో విశేషాలు పూసగుచ్చే బంధువులా అనిపించే గోదావరి మొదటిసారి అపరిచితలా అనిపిస్తోంది. ఎందుకంత గాంభీర్యం ... ఎందుకింత ఒంటరితనం ...?గోదావరిలా మనసంతా కల్లోలం .. కలత .. వేదన! నెల రోజులుగా ఇదే పరిస్థితి. ఇలా ఎన్నాళ్లుంటుందో!సత్రం ప్రహరీ దగ్గర ఆగింది ఆటో.

లోపలికి అడుగు పెట్టగానే వేదపాఠశాల పిల్లలు వినాయకుడి గుడి అరుగు మీద ఎదురెదురుగా రెండు వరుసలుగా కూర్చుని ప్రవర వల్లె వేస్తున్నారు. ఎటుచూసినా పొడవాటి లేత ఆకులున్న అరటి చెట్లు .. రకరకాల పూల మొక్కలు .. పనస చెట్టు .. మామిడి చెట్ల మధ్య దారిలో కాస్త ముందుకు వెళ్తే అపరకర్మల కోసం కట్టించిన రెండంతస్తుల మేడ. దాని పక్కనే విశాలమైన స్థలం. తడిపిన బట్టలు ఆరేసుకోడానికి అయ్యుంటుంది. అక్కడే మా బస. పని.పెట్టెలూ గట్రా మొదటి అంతస్తు గదుల్లో పడేసి, అందర్నీ పలకరించి, లాంఛనంగా కోటిలింగాల రేవు చివరి మెట్టుకు వెళ్లాను. మెట్ల మీద పడుకున్న యాచకుడు నిద్ర లేచి, గోదారికి రెండు చేతులూ జోడించి, వెనక్కి తిరిగి కోటిలింగేశ్వరుడికి దణ్ణం పెట్టాడు. ఉమా కోటిలింగేశ్వరస్వామి గుడికి భక్తులు వరస కట్టారు. గోపురం మీంచి లింగాష్టకం వినిపిస్తోంది. ఎస్‌.పి.బాలు స్వరం గరళకంఠుడికి అభిషేకం చేస్తున్నట్టుంది.