ఇంట్లోంచి కనిపించకుండా పోయిన కూతురు.. ప్రేమ వ్యవహారమే కారణమయి ఉంటుందని భావించాడా తండ్రి. కూతురి డైరీలో ఓ యువకుడి ఫొటో కింద ఐ లవ్యూ అని రాసి ఉండటంతో అనుమానం అతడి అనుమానం నిజమయింది.. వెంటనే ఆ యువకుడు ఎవరో ఆరా తీశారు.. అతడి ఇంటికెళ్లి విషయమంతా చెప్పాడు. కానీ తనకేమీ తెలియదని చెప్పాడా యువకుడు. మొత్తానికి నిజం తేల్చుకునేందుకు ఆ యువకుడు ఉద్యోగం చేస్తున్న సిటీకే రైల్లో బయల్దేరారు.. మార్గమధ్యంలో ఓ చోట రైలు ఆగింది.. కిటికీలోంచి బయటకు చూసిన ఆ తండ్రి.. దూరంగా ఓ మేడ మీద బట్టలు ఆరేస్తున్న ఓ యువతిని చూసి షాకయ్యాడు.. ఆమె ఎవరో కాదు.. తన కూతురే.. ఆ యువకుడు కూడా ఆమెను చూసి కంగుతిన్నాడు.. వెంటనే అక్కడే రైలు దిగాలనుకున్నారు.. కానీ.. 

***************************

ఆదివారం ఉదయం ఎనిమిది కావొస్తోంది.వాతావరణం ముసురుగా ఉంది. చెన్నైలో మబ్బు కమ్మితే భయమేస్తుంది.‘‘జరూరు పని తగిలింది. ఆఫీసుకోసారి రాగలవా?’’ సీనియర్‌ కొలీగ్‌, కంపెనీ యజమాని కొడుకు రాజారామన్‌ ఫోన్‌ చేశాడు. అప్పటికి నేను లేచి అరగంట దాటింది. పెర్క్యులేటర్‌ కాఫీ తాగుతూ టీవీలో అమ్మ వార్తలు వింటూ అరవం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. 

నేను సమాధానం చెప్పేలోగానే, ‘‘అరగంటలో తయారై సిద్ధంగా ఉండు. నేను వచ్చి నిన్ను పికప్‌ చేస్తాను’’ అన్నాడు. ఏకపక్ష నిర్ణయం ముందే తీసేసుకున్నప్పుడు, ‘రాగలవా?’ అని అడగడమెందుకు? సరే, ఆదివారం ఆఫీసుకు పోవాలని అంటే అలిగి ఆలి లేనివాణ్ణి, బ్రహ్మచారిని, వంక పెట్టడానికి వీలులేనివాణ్ణి కాబట్టి లేచి గెడ్డం గీసుకుని, స్నానంచేసి పాతిక నిముషాల్లో తయారయ్యాను. మూడో అంతస్తులోని సింగిల్‌ రూం అపార్ట్‌మెంట్‌ నుంచి మెట్లు దిగి, చిన్నగా పడుతున్న చినుకుల్లో గొడుగేసుకుని కాంపౌండ్‌ దాటి, గేటు దగ్గర నిలబడ్డాను. చెప్పిన సమయానికి ఇంకా మరొక్కనిమిషం సమయం ఉందనగా, రాజారామన్‌ కారు అల్లంత దూరంలో కనబడింది. గట్టిగా శ్వాసపీల్చాను.

కారు నెమ్మదిగా వచ్చి నా ముందు ఆగింది.కారు వెనక సీటులో మా ఆఫీసులోనే పనిచేసే సుహాసిని కూర్చుని ఉంది. కంప్యూటర్ని కూడా తన విన్యాసాలతో గడగడలాడించే విదుషీమణి. కారు ఫ్రంట్‌ సీట్‌ డోరు తీశాను. రాజారామన్‌ బ్రీఫ్‌కేసూ, ఇంకా ఏవో ఫోల్డర్సూ సీటునిండా పడిఉన్నాయి. సరేనని వెనకసీటులో సుహాసిని పక్కన కూర్చున్నాను. లేటెస్ట్‌ పురషాకర్షక సండే స్పెషల్‌ పెర్‌ఫ్యూం ఏదో వాడిందనుకుంటాను, సుహాసిని సువాసనలు వెదజల్లుతోంది. చిరునవ్వులు నవ్వుతూ ‘‘స్పాయిల్డ్‌ సండే!’’ అంది.