యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ కూబింగ్ ఆపరేషన్‌ చేపట్టింది. తుపాకులు ఎక్కుపెట్టి సవ్వడిచేయకుండా అప్రమత్తంగా ముందుకు నడుస్తోంది. నక్సల్స్‌ స్థావరాన్ని సమీపించేకొద్దీ వారిలో ఉత్కంఠ. పొదలమాటునుంచి నక్సలైట్‌ సెంట్రీలు వారిని చూడనే చూశారు. మరుక్షణంలోనే ఆ నిశ్శబ్దారణ్యం తుపాకీశబ్దాలతో మార్మోగింది. ఆకుపచ్చని అరణ్యం రక్తంతో తడిసిముద్దైంది. కానీ మరోచెంప అక్కడ మానవత్వం కూడా వెల్లివిరిసింది!

డ్యూటీ ముగించుకుని ఇంటికిరావడం ఆలస్యం నా భార్య గీత మగపిల్లలిద్దరిగురించి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. ‘‘వీళ్ళ మధ్య గొడవ జరగని రోజు లేదంటే నమ్మండి. నిన్నటివరకూ పరుషమైన పదాలతో ఒకరినొకరు తిట్టుకునేవారు. ఈరోజు ఏకంగా కలబడి కొట్టుకున్నారండీ. వాళ్ళని విడదీసేటప్పటికి ప్రాణం పోయేంత పనైంది. ఇక నావల్లకాదు. మీరీరోజు ఏదో ఒక పరిష్కారం చేయాల్సిందే’’ అంది.మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి శ్రావ్యకు పన్నెండేళ్ళు. పెద్దబ్బాయి నరేంద్ర పదో తరగతి చదువుతున్నాడు. రెండోవాడు కిరణ్‌ వాడికన్నా ఓ ఏడాది చిన్న. చిన్నప్పుడు ముగ్గురూ ఒకజట్టులా ఉండేవారు. రెండుమూడేళ్ళనుంచి నరేంద్రకూ కిరణ్‌కు పడటంలేదు. ప్రతిచిన్నదానికి వాదులాడుకోవడంతో మొదలెట్టి ఒకరినొకరు తిట్టుకునేదాకా వచ్చిన సమస్య ఇప్పుడు కొట్టుకునేస్థాయికి చేరింది.

శ్రావ్యను ఇద్దరూ చెల్లీ అంటూ గారాబం చేస్తారు. కానీ కిరణ్‌ నరేంద్రని అన్నా అని పిలవడు. నరేంద్ర కిరణ్‌ని తమ్ముడిలా చూడడు. వాళ్ళిద్దరిమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేంత ద్వేషం ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదు.మొదట్లో ఒకరిమీద ఒకరు పితూరీలు చెబుతుంటే మగపిల్లల్లో ఇది సహజమేకదా అను కున్నాను. తన పుస్తకాలు నరేంద్ర చించేశాడని కిరణ్‌ అంటే తన చొక్కామీద బాల్‌పెన్‌తో గీతలు గీశాడని నరేంద్ర చెప్పేవాడు. అన్నదమ్ములిలా తగువులాడుకోకూడదనీ, సఖ్యతగా ఉండాలని సర్దిచెప్పి పంపించేవాడిని.

నరేంద్రని అన్నయ్యా అని పిలవాలని ఎంత చెప్పినా కిరణ్‌ వినేవాడుకాదు. ‘నాకంటే ఓ ఏడాదేగా పెద్ద. నేను పిలవను’ అనేవాడు. ఏదోలే చిన్నచిన్న గొడవలేకదా, వాడే తెలుసుకుంటాడులే అనుకుంటుంటే ఈరోజు వాళ్ళగొడవ తారాస్థాయికి చేరింది. ఐనా కొట్టుకోవడమేమిటి? మా పెంపకలోపమా? ఎప్పుడైనా నేనుగానీ, గీతగానీ వాళ్ళకి ఏ విషయంలోనూ తక్కువచేయలేదే. ఎందుకిలాంటి మనస్తత్వం అలవడింది? ఇద్దర్నీ పిలిచి నాముందు కూచోబెట్టుకున్నాను. వాళ్ళ మొహాలు కోపంతోనో ద్వేషంతోనో ఇంకా రగులుతూనే కనిపించాయి.