ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది తాయారు. హర్రర్‌ సీరియల్లో దెయ్యంలా గుడ్లప్పగించి సీలింగ్‌ కేసి చూసింది. అపరకాళి సీరియల్లో భూతంలా భయపెట్టే గయ్యాలి అత్త గుర్తుకొచ్చి అదిరిపడి లేచి కూర్చుంది తాయారు.రెండు కాళ్ళూ బార్లాచాపి వెళ్ళకిలా గురకపెడుతూ పడుకున్నాడు బంగారయ్య. శరీరంమీద ఏ అచ్ఛాదనా లేదు. కనీసం లంగోటా అన్నా కట్టుకోరా మగడా అంటే, ‘‘రాత్రిపూట ఎలా పడుకుంటే ఏటిలేయే తాయారూ’’ అంటాడు. మొలకు కట్టుకున్న లుంగీ కూడా ఊడి కాళ్ళ దగ్గర పడి ఉంది. మొగుడికేసి ఓరగా చూసి మూతి మూడు వంకర్లు తిప్పుకుంది. ‘విగ్రహపుష్టి నైవేద్యనష్టి’ అంటే ఇదేనేమో అనుకుంది మనసులోనే.

‘ఏం పాడో, ఓ పట్టాన నిద్రపట్టి పట్టిచావటంలేదు’ అనుకుంటూ హాల్లో కొచ్చింది. మళ్ళా టీవీ ఆన్‌చేసి రిమోట్‌ చేత్తో పట్టుకుని సోఫాకు జేరగిలబడి కూర్చుంది.ఒక్కోఛానల్‌ మార్చుకుంటూ వెళ్తోంది. ‘వెధవది తను చూడాల్సిన సీరియల్‌ ఒక్కటి కూడా ఈ టైమ్‌లో లేదు’ అనుకుంటూ ఏదో చానల్‌ దగ్గర ఆగింది తాయారు.ఎవరో అమ్మాయి ఒంటికి అతుక్కుపోయిన దుస్తులు ధరించి యోగా నేర్పిస్తోంది. సన్నగా నాజూగ్గా ఉంది. ఆ అమ్మాయి చేస్తున్న యోగా భంగిమలకు తగ్గట్టుగా వెనుక సంగీతం మంద్రంగా వినిపిస్తోంది.

గదిలో పడుకున్న బంగారయ్య ఎవరో తట్టిలేపినట్టు ఉలిక్కిపడి లేచాడు. ప్రక్కనే భార్య తాయారు కనిపించకపోయేసరికి మంచంమీదనుంచి లేచి బెడ్‌లైట్‌ వెలుతురులోనే గదంతా వెతుక్కుంటూ హాల్లోకొచ్చాడు.సోఫామీద రెండుకాళ్ళూ మడిచి బాసికపట్టు వేసుక్కూర్చుని ఉంది తాయారు. ఎదురుగా ఉన్న టీవీ వెలుతురు తాయారు మొహంమీద పడుతూ రకరకాల రంగులు మారుస్తోంది. టీ.వీ. వెలుగులో చింపిరి జుత్తు విరబోసుకుని దెయ్యంలా కనిపించింది తాయారు.