భార్యా విధేయుడాయన. బుద్ధిగా మెలుగుతాడు. భార్య హాట్‌హాట్‌గా ఉన్నప్పుడు వినయవిధేయతలు ప్రదర్శిస్తూ మోస్ట్‌ ఒబీడియంట్లీ అన్నట్టు ఉంటాడు. ప్రెషర్‌ కుక్కర్‌లో స్టీము బయటకొచ్చేసేందుకు ఉపయోగపడే సేఫ్టీవాల్వ్‌ తరహాలో భార్య కోపాగ్ని శాంతింపజేసేందుకు సహన కౌశలం ప్రదర్శిస్తాడు. భార్యమాటలకు ఔదలదాల్చుతూనే బాలెన్స్‌ చేసుకొస్తాడు. ఓసారి కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే....

‘పాతసామాను కొంటా, పాత టీవీలు కొంటాం, పాత ఫ్యాన్లు, గ్రైండర్లు పాత సోఫాలు పాత కుర్చీలు, పాత మంచాలు పాత పరుపులు, పాత స్టీలు సామాన్లు, ప్లాస్టిక్‌ సామాన్లు ఖరీదుకు కొంటాం...’ఓ ఆటోరిక్షా దానికో మైకు రికార్డెడ్‌ కేసెట్‌పెట్టి వీధులెమ్మట తిరుగుతున్నారు ఇద్దరు కుర్రాళ్లు.నేను ఫలహారం పూర్తిచేసి అపార్టుమెంటు బాల్కనీలో కూర్చుని దినపత్రిక చదువుతుంటే పాత సామాన్లు కొంటాం అని మైకులో వినపడగానే చదవడం ఆపేసి మా మేడమ్‌ని పిలిచా.‘‘ఏమోయ్‌! ఇంట్లో ఏమైనా పాతసామాను ఉంటే ఇలాపట్రా. వీళ్లు ఖరీదుకు కొంటారట’’ అన్నాను.‘‘ఏం తమాషాగా ఉందా? ఇదేమైనా మన ఇల్లనుకున్నారా, పాతసామాన్లు ఉండడానికి? కోడలు బయటకు వెళ్లింది కనుక సరిపోయింది. తను వింటే మీకు క్లాసుపీకేది. ఆ మాటకొస్తే మీరూ నేనే ఈ ఇంట్లో పాత సామాన్లం, కొంటారేమో కనుక్కోండి ’’ మా మేడమ్‌ రియాక్షన్, డబుల్‌స్ర్టాంగ్‌ ఫిల్టర్‌కాఫీ...షుగర్‌లెస్‌ తాగినట్లనిపించింది.‘అమ్మో! పొద్దున్నే ఇంతలా రియాక్టయిందంటే ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి’ అనుకుని మళ్లీ పత్రిక చదవడంలో నిమగ్నమయ్యానుకాసేపటికి తనే వచ్చి ‘‘కాఫీ తాగుతారా?’’ అంది.

నేను ఇందాకటి షాక్‌నుంచి తేరుకోలేదేమో ‘‘ఊ’’ అన్నాను మంద్రస్వరంలో.‘‘గట్టిగా చెప్పండి. ఫలహారం చేశారుగా?’’ అంది చిన్న పిల్లాడిని గద్దించినట్లుగా.‘‘ఇస్తే తాగుతా’’ అన్నాను.‘‘ఏం మరీ అంత భయపడి ఛస్తున్నారు, నేనేమైనా బ్రహ్మరాక్షసిలా కనపడుతున్నానా?’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది.మేడమ్‌ ఇవాళెందుకో ‘గరమ్‌-గరమ్‌’గా ఉంది. కోడలుపిల్లతో ఏమైనా ‘డిష్యుం-డిష్యుం’ అయ్యిందేమో అనుకుంటూ ఆ తెచ్చే కాఫీ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను.కాఫీ కప్పు నా చేతికి అందించి నా ఎదురుగా ఉన్న కేనచైర్‌లో కూర్చుంది.తలెత్తి ఆమె ముఖంలోకి సూటిగా చూడాలంటే ధైర్యం చాలడం లేదు. చేతిలో కాఫీ కప్పు బేలన్స్‌ చేసుకుంటూ అలానే ఉండిపోయాను. చెయ్యి వణకుతోంది.