ఇది నిన్నా మొన్నా జరిగిన కథ కాదు. ఎప్పుడో జరిగింది. చాలా ఏళ్ళ కిందట ఉజ్జయినినగరంలో శివయ్యను రాజభటులు నిర్బంధించారు. అతను రాజద్రోహానికి పాల్పడ్డాడని నేరారోపణ. కారాగారంలో బంధించారతన్ని. శివయ్యకు అరవై ఏళ్ళుంటాయి. బాగా చదువుకున్నాడు. ఆ చదువుకోవడంతోనే వచ్చింది తంటా. చదువుకున్నాను అన్న గర్వంతోనే మహారాజు చంద్రవర్మను శివయ్య విమర్శించాడంటారు. అందుకే కటకటాలపాలయ్యాడని చెబుతారంతా.శివయ్యకు పుస్తకాలు తప్ప నా అనే వాళ్ళు లేరు. కలమూ, పుస్తకమే అతని స్నేహితులు. ఆ ఇద్దరూ కారాగారంలో లేరు. దాంతో మరింత ఒంటరివాడయ్యాడతను. సూర్యోదయ, సూర్యాస్తమయాలు చూస్తూ రోజుల్ని గడపసాగాడు. పొద్దున, సాయంత్రం కారాగార ప్రాంగణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ నడవడం శివయ్యకు అలవాటు. ఆకాశాన్ని అంటుతున్న కారాగారం రాతిగోడల్ని చూస్తూ, వాటిని చేత్తో రాస్తూ నడవడం అంటే అతనికి చెప్పలేనంత ఇష్టం. ఎన్ని రాళ్ళతో గోడను నిర్మించారో శివయ్యకు బాగా తెలుసు. నిద్రలో అడిగినా వాటి సంఖ్య చెబుతాడతను. రాళ్ళను లెక్కపెట్టడమే పెద్ద పనిగా పెట్టుకుని నడుస్తున్నాడతను.ఎప్పట్లాగే రాళ్ళను లెక్కపెట్టుకుంటూ ఓ రోజు నడుస్తున్నాడు శివయ్య. నడుస్తూ నడుస్తూ కాలెత్తి వేయబోయి, ఒక చోట ఆగిపోయాడు. ఆశ్చర్యంగా చూశాడు. గోడకి గల రెండు రాళ్ళ మధ్య నుంచి చిన్న మొక్క మొలుచుకొచ్చింది.

చిటికెన వేలంత మొక్క, లేతగాగోధుమరంగులో ఉండి, నూగుతో ఉంది. కాలెత్తి, దాన్ని నలిపి పారేద్దామనుకున్నాడు. కాలు రాలేదు. చేయెత్తి, పెరికి పారేద్దామనుకున్నాడు. చేయి రాలేదు. వంగి జాగ్రత్తగా మొక్కను పరిశీలించాడు శివయ్య. విత్తనాన్ని చీల్చుకుని వచ్చింది మొక్క. రెండుగా చీలి విత్తనం కనిపిస్తోంది. ఏంవిత్తనమో ఏమో! ఎదగనీ అనుకున్నాడు. తిరిగి వచ్చేశాడు. రాత్రి అంతా దాని గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. తెల్లారింది. నడక మొదలెట్టాడు. ఇటు నుంచి నడిచి వెళ్తే మొక్కని ముందుగా చూడలేమని, అటుగా నడక సాగించాడు. మొక్క దగ్గరకు తొందరగా చేరుకున్నాడు. చూశాడు దాన్ని. మొక్క ఆకు తొడిగింది. రెండు చిన్ని ఆకులు పుట్టుకొచ్చాయి. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంది మొక్క. పచ్చగా ఉంది. దృఢంగా ఉంది. చాలాసేపు దాన్ని గమనిస్తూనే నిల్చున్నాడక్కడ. మొక్కలోని అణువణువునూ గుర్తించాడు శివయ్య. అంటీ అంటనట్టుగా చేతిని తాకించి, మొక్కను నిమిరాడు. వెను తిరిగాడు. ఆ రోజు నుంచీ రోజూ మొక్కను చూడడం దినచర్యలో భాగం చేసుకున్నాడు శివయ్య. చలికి అది వణికిపోతుంటే బాధపడేవాడు. ఎండకు ఎండిపోతుంటే భయపడేవాడు. బాధపడుతూ, భయపడుతూ ఏ మేరకు మొక్క ఎదిగిందీ లేనిదీ గమనించేవాడు.