నాకు తెలిసి నాకెవరూ విరోధుల్లేరు!నాకు తెలియకుండా నేనెవరికైనా విరోధినయ్యానేమో నాకైతే తెలియదు! కానీ నేనేమిటో మీక్కూడా అర్థం కావాలంటే, నేను చెప్పే నా కథలోకి మీరు ప్రవేశించాల్సిందే.

వరంగల్‌ వెళ్ళే బస్‌ ఉదయం ఎనిమిది గంటలకు జగిత్యాల నుండి బయల్దేరింది.ఓ నలుగురు అబ్బాయిలు రష్‌గా ఉన్న ఆ బస్‌ ఎక్కేశారు. కండక్టర్‌ టికెట్‌ అడిగితే ‘పాస్‌’ అన్నారు అందరు.నమ్మకం!నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. రెగ్యులర్‌గా ఇదే బస్సెక్కే ఆ విద్యార్థులు అబద్ధం ఆడరనే నమ్మకంతోనే పాస్‌లు చెక్‌ చేయలేదు కండక్టర్‌. కానీ ఏ నమ్మకమైనా వృత్తిధర్మానికి అడ్డు కాకూడదు.ఇప్పుడదే జరగబోతోంది.బస్‌ పోతారం, రాజారాం దాటుతుంటే ఎదురుగా వచ్చిందో జీప్‌. అది గమనించి డ్రైవర్‌ స్లో చేసి బస్సును ఓపక్కగా ఆపాడు. ఇద్దరు తనిఖీ అధికారులు బస్సెక్కి టికెట్స్‌ తనిఖీ చేయడం ప్రారంభించారు.ఓ అబ్బాయి ‘‘సార్‌! కాలేజీకి లేటవుతోంది. ప్లీజ్‌ స్పీడప్‌’’ అన్నాడు.‘‘ఇప్పటికే ఈ బస్‌ అరగంట లేటు. మధ్యలో మీ వాయింపొకటి!’’ ఒక్కసారిగా ప్రయాణీకులు కోరస్‌గా అన్నారు. ఆ అధికారులు మౌనంగా తమ విధి నిర్వహణలో మునిగిపోయారు.

ఇందాకటి నలుగురు పిల్లల దగ్గరకొచ్చాడో అధికారి. లేటవుతోందని కామెంట్‌ చేసిన అబ్బాయితప్ప మిగతా ముగ్గురు పాస్‌లు చూపించారు. ఆ కుర్రాడు పాస్‌కోసం జేబులన్నీ వెతికాడు. కానీ జేబుల్లో ఎక్కడాలేదు. కంగారుగా ఆ అధికారులకేసి చూశాడు.‘‘ముందు చూసుకుంటే టికెట్టు కొనేవాళ్ళం కదా!’’ అని ఆ నలుగురు స్నేహితుల్లో ఒకడు చొరవతో మందలింపుగా అన్నాడు.ఆ అబ్బాయి ఇప్పుడు బస్సు నిబంధనలు ఉల్లంఘించిన దోషి. దొరికిపోయాడు అధికారికి.‘‘ఏం నాయనా? ఇందాక లేటవుతోందని అంత చిరాకుపడిపోయావ్‌! మరి అంత బుద్ధిమంతుడివి పాస్‌ లేకుండా, టికెట్‌ తీసుకోకుండా బస్సులో ఎలా ప్రయాణిస్తువ్‌?’’ అధికారిక స్వరంతో హేళనగా అన్నాడాయన.