చిన్న వయసులోనే రాజకీయల్లో ప్రవేశించాడతను. నీతీ నిజాయతీ అతడి ట్యాగ్‌లైన్‌. నీతి తప్పిననాడు రాజకీయాలనుంచి వైదొలగాలన్నది అతడి నిశ్చయం. అనుకున్నవిధంగానే రాజకీయాల్లో రాణించాడు. మినిస్టరయ్యాడు. కొడుకు ఎదుగుదల, ఆశయాలు చూసి కన్నతండ్రి తెగ మురిసిపోయాడు. కొడుక్కి మద్దతుగా ఓ ‘రాచకార్యం’ మీద బయల్దేరాడా తండ్రి. ఆ ప్రయాణంలో అతడో అద్భుతాన్ని చూశాడు. ఏమిటది? వాళ్ళకీ దానికీ ఏమిటి సంబంధం?

సీతారాంపురంలోని మా పిచ్చుకగూడుకి పునఃప్రవేశ సందర్భంగా మన చిన్ననాటి స్నేహబంధాన్ని ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. అందరి చిరునామాలూ, ఫోన్‌ నెంబర్లూ వెనకపేజీలో రాస్తున్నాను. మీరంతా సంప్రదించమని, ఈ ఉత్తరం అందిన వారం పదిరోజుల తర్వాత ఎప్పుడైనా సరే, అందరూ ఒక్కసారిగా గానీ లేక కొందరు కొందరుగా గానీ మీ మీ వీలునుబట్టి ఆలోచించుకుని, రాకపోకల సమాచారాన్ని నాకు కొంచెం ముందుగా తెలియజేస్తే, తగిన ఏర్పాట్లు చేయగలిగే సావకాశం ఉంటుందని మనవిచేస్తున్నా. మూడునాలుగు రోజులు బాల్యస్మృతులను నెమరేసుకుంటూ మనందరం ఆనందంగా గడపాలనే నా కోరికే ఈ పిలుపుకి ముఖ్యకారణం. మన సమావేశం మనకి ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించే టానిక్కులా పనిచేస్తుందనే నమ్మకంతో తప్పక హాజరవుతారని ఆశిస్తున్నాను.ఇట్లు,(ఇప్పటి) మాధవరావు (ఒకప్పటి మీ మధు).

ఆ ఉత్తరం చదవగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడప్పుడూ ఫోనులో పలకరించుకోవటమేగానీ ఉత్తరాల అలవాటులేదు. అందుకే వాడు ఉత్తరం రాయటం కొత్తగా ఉంది.వెనకపేజీలో ఉన్న మా స్నేహితుల వివరాలు చూశాను. ఆ ఆరుగురిలో నలుగురం మా సీతారాంపురానికి చెందినవాళ్ళమే. మిగతా ఇద్దరూ పక్కఊరివాళ్ళు. మా అందరి హైస్కూలు చదువు మాకు దగ్గర్లో ఉన్న బస్తీలో జరిగింది. మధు ఒక్కడే మా ఊరిలో వ్యవసాయం చూసుకుంటున్నాడుగానీ మేము మాత్రం ఉద్యోగాలరీత్యా ఎక్కడెక్కడో తిరిగి వేరే వేరేచోట్ల స్థిరపడ్డాం.మధు కూడా భార్య చనిపోయాక హైద్రాబాద్‌లో ఉంటున్న కొడుకు దగ్గరికి మకాం మార్చాడని తెలుసు. మరి మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సొంత ఊరుకి ఎందుకు చేరినట్లు..? ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్టు మమ్మల్ని పిలవటంలో, సరదాగా గడపాలనే కోరిక కాకుండా ఇంకేదైనా ఉద్దేశ్యం ఉందా? నాలుగైదుల పెద్దమండువా లోగిలిని పిచ్చుకగూడు అని ఎందుకు అంటున్నాడో?