‘ఆఫీసులో తనని వేధిస్తున్న అధికారిని చెప్పుతో సత్కరించిన మహిళ...’ అనే హెడ్‌లైన్‌తో టీ.వీ లో పదేపదే ప్రసారమవుతున్న ఆ వార్తచూసి ఒక్కసారిగా నవ్వింది హైందవి.

అక్కడే సోఫాలో కూర్చుని జాజిపూలమాల అల్లుతున్న జాహ్నవి, ‘‘ఎందుకే...ఆ నవ్వు?’’ అని అడిగింది ఆసక్తిగా. 
‘‘ఏం లేదు జానూ....టీ.వి లో వస్తున్న ఆ న్యూస్‌ క్లిప్పింగ్స్‌ చూస్తే నవ్వొచ్చింది ఎందుకో!’’ కాస్త సీరియస్‌గా ముఖంపెట్టి చెప్పింది హైందవి.
అంతలోనే అలామారిన ఆమె వైఖరికి విస్తుపోతూ, గుత్తంగా కూర్చిన జాజిపూలమాలను చిన్నకత్తెరతో కత్తిరించి, ఓ ముక్క హైందవితలలో తురిమి, తానూ అలంకరించుకుంది జాహ్నవి. అప్పుడప్పుడే సన్నసన్నగా విచ్చుకుంటున్న జాజులసువాసన అందమైన ఆ సాయం సంధ్యను మరింత పరిమళభరితం చేస్తోంది. 
జాహ్నవి తన దృష్టిని టీ.వీ వైపు మళ్లిస్తూ కిందన మళ్లీమళ్లీ స్ర్కోల్‌ అవుతున్న ఆ వార్తచూసి ‘‘ఇందులో నవ్వేందుకేముందే! స్ర్తీలు సమాజంలో ఇంతటి హీనస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాల్సిందిపోయి...అయినా ఆవిడెవరో మా బాగా బుద్ధిచెప్పిందిలే!’’ అంది కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త సంతోషం కలగలిపి.
ప్రస్తుతం తామున్న సమాజంలో ఉద్యోగస్తులైన ఆడవాళ్లు, తమ పై అధికారులు, సహో ద్యోగులవలన సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కి గురవుతూ అంతులేని మానసికవేదనకు లోనవుతున్నారన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని మూగబాధతో, పెదవి విప్పకుండా అలాంటి వికృతచేష్టలు భరించేవారు కొందరైతే...ధైర్యంతో తిరగబడి ఇందాకా టీ.వీ లో చూపించినట్లు వాళ్లకి బుద్ధిచెప్పే మహిళలు మరికొందరు. 
చాలామంది కామాంధులు తమకున్న అధికారవనరులను దుర్వినియోగంచేస్తూ, స్ర్తీని భోగ్యవస్తువుగా భావించి ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. మీడియా తమ డేగకన్నుతో ఇలాంటి ప్రబుద్ధులను పసిగట్టి, ఎండగడుతున్నాసరే, చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. 
జాహ్నవి ఆలోచనలు ఇలా నేలజారిన పాదరసంలా చురుకుగా పరుగులు తీస్తూండగా అంది హైందవి. ‘‘నిజానికి నేనునవ్విన కారణం వేరు జానూ...నిజానికి తనని హెరాస్‌ చేసినవాడిని అంతధైర్యంగా నాలుగు తన్నినందుకు ఆవిడ సాహసాన్ని అభినందించాలి. అదలా ఉంచితే ఇలా బయట ప్రపంచం దృష్టిలోకి వస్తున్నది ఒక పార్శ్యం మాత్రమే...కానీ, పబ్లిక్‌ ప్లేసులలోనూ, ఇళ్లలోనూ ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటున్నవారి సంగతేమిటి? వయసుతో సంబంధం లేకుండా చాలామంది స్ర్తీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్య ఇది. 
అలాంటివాళ్లు బయటకు రాకుండా ఉండి పోతున్నారే అన్న ఆవేదనతోనే అలా నవ్వాను. కన్నతల్లికి కూడా చూపించడానికి సిగ్గుపడుతూ, ఎంతో పదిలంగా కాపాడుకునే ఈ శరీరాన్ని ఇష్టమొచ్చినచోట, ఇష్టమొచ్చిన రీతిలోతాకి, పైశాచికానందం పొందే అలాంటి మగాళ్లని ఏంచేసినా పాపం లేదు. అసలా హక్కు వాళ్లకెవరిచ్చారు?’’ ఆక్రోశంతో గండెలెగిసిపడ్డాయి   ఆమెకి. 
హైందవి యాతన అర్థంచేసుకున్నదానిలా ఆమె భుజంతట్టిన జాహ్నవి, ‘‘నువ్వు అన్నది నిజమేగానీ, అలా బాధింపబడేవారికి తమని తాము రక్షించుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఉద్యోగినులకి ఆ వెసులుబాటు ఉండదు. ఉద్యోగంచేస్తేకానీ ఇల్లుగడవని పరిస్థితుల్లో ఆఫీసుకెళ్లే ఆడది ఈ రకమైన వేధింపులు భరిస్తూ ఎంతకాలం పని చేయగలదుచెప్పు! మింగలేక కక్కలేక ఆమెపడే అవస్థ ఎంత దారుణంగా ఉంటుందో కదా!’’ అంది జాలిగా.