విదర్భదేశ రాజు వీరవర్మ.ఆయనకు లేకలేక కలిగిన పుత్రుడు ప్రతాపవర్మ. బంగారు మేనిఛాయతో, చక్కటి రూపంతో, ముద్దు చేష్టలతో, ముఖాన రాచకళ ఉట్టిపడుతూండే ఆ బాలుడు తల్లి యశోవతికీ, తండ్రి వీరవర్మకూ అపరిమితానందాన్ని కలిగించేవాడు. ఐతే, ప్రతాపవర్మకు ఐదేళ్లొచ్చేసరికి అతడికి బాగా నత్తి ఉన్నదని తలిదండ్రులకు అర్థమైంది. అంతకాలం అది బాల్యానికి సంబంధించిన చేష్టగా భావించారుతప్ప తమ కొడుక్కి అలాంటి అవకరం ఉన్నదని వారికి తోచలేదు.

వీరవర్మ యశోవతితో, ‘‘మనవాడికి ఈ అవకరంతప్ప అన్నీ సులక్షణాలే! అయితే, రాజుకు నత్తి ఉంటే అంతా అపహాస్యం చేస్తారు. ప్రజల్లో గౌరవం ఉండదు. మనమీ విషయం దాచిపెట్టాలి’’ అన్నాడు.‘‘దీనికి వైద్యం లేదా?’’ అంది రాణి దిగులుగా. ‘‘ఉండొచ్చు కానీ, యువరాజుకు నత్తి ఉన్నదన్న విషయం నీకూ నాకూ తప్ప మూడో మనిషికి తెలియడం నాకిష్టం లేదు’’ అన్నాడు వీరవర్మ.‘‘ఇప్పటికే అంతఃపురంలో ఒకరిద్దరు దాదులకీ విషయం తెలుసని నా అనుమానం’’ అంది యశోవతి. ‘‘వారిని ఏదోలా మభ్యపెట్టి మరిపించు. ఇకమీదట యువరాజుసంరక్షణ దాదులకు వదిలిపెట్టొద్దు. మనమే చూసుకుందాం’’ అన్నాడు వీరవర్మ.అప్పుడా దంపతులు ఓ కథ అల్లారు. ఆ ప్రకారం యువరాజు ప్రతాపవర్మని ఏదో దుష్టగ్రహం పట్టుకుని పీడిస్తోంది.

ఆ బాధ తప్పించుకునేందుకు యువరాజు మౌనవ్రతాన్ని పాటించాలి. తలిదండ్రులతోతప్ప వేరెవ్వరితోనూ అతడు మాట్లాడడు. తల్లియే అతడికి దాదియై సంరక్షణ చూసుకుంటుంది. తండ్రియే అతడికి గురువై సకలవిద్యలూ నేర్పుతాడు.అయితే, యువరాజన్నాక, ఎల్లకాలం అంతఃపురానికి కట్టుబడి ఉండకూడదుగదా! ప్రజలమధ్యకు వెడతూండాలి. వారిగురించి తెలుసుకుంటూ ఉండాలి. అందుకని, వీరవర్మ ఓ ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం ప్రతాపవర్మ ఇతరులతో వ్యవహరించడానికి సౌంజ్ఞలు చేస్తాడు. ఆ సౌంజ్ఞలు అర్థం చేసుకునేలా సునందుడనేవాడికి శిక్షణ ఇప్పించారు రాజదంపతులు. ప్రతాపవర్మ సౌంజ్ఞల అర్థాన్ని ఇతరులకి వివరించే బాధ్యత సునందుడికి అప్పగించబడింది. యువరాజు ఎక్కడికి వెళ్లినా, సునందుడు అతణ్ణి అంటిపెట్టుకుని ఉండేవాడు.