ఒకానొకప్పుడు విదేహదేశాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ రాజు కొలువు తీరి ఉండగా, విరూపాక్షుడనే మాంత్రికుడు వచ్చి, ‘‘మహాప్రభూ! మంత్రవిద్యలో నాకు నేనే సాటి. నా విద్యలతో రోజుకొకరకంగా తమకు వినోదం కలిగించగలను. నాకు తమ కొలువులో స్థానం ఇప్పించండి’’ అన్నాడు. వీరసేనుడు ముందుగా విరూపాక్షుణ్ణి తన సామర్ధ్యం నిరూపించుకోమన్నాడు.

అప్పుడు విరూపాక్షుడు తన మంత్రశక్తితో గాలిలోకి ఎగిరాడు. వానలు కురిపించాడు. మనుషుల్ని చిలకలుగా మార్చాడు. మళ్లీ వారిని మనుషుల్ని చేశాడు. ఆ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. కొలువులోని వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. వీరసేనుడు కూడా ఎంతో సంతోషించి, ‘‘నీ సామర్థ్యం ప్రశంసనీయం. ఈ రోజునుంచీ నీవు నా ఆస్థాన మాంత్రికుడివి. నెలకు వేయి వరహాలు జీతం’’ అని చెప్పాడు.ఈ విషయం క్రోధాక్షుడనే మరో మాంత్రికుడికి తెలిసింది. అతడు ఆకాశమార్గాన పయనించి హుటాహుటిన రాజాంతఃపురానికి వెళ్లి వీరసేనుణ్ణి కలుసుకున్నాడు. ‘‘నీ కొలువులో మాంత్రికుణ్ణి నియమించావని తెలిసింది.

ఈ రాజ్యంలో నేను ఉండగా, నీ కొలువులో మరో మాంత్రికుడు ఉండటానికి వీల్లేదు. వాణ్ణి తీసేసి, నన్ను ఆస్థాన మాంత్రికుడిగా నియమించు’’ అన్నాడు క్రోధాక్షుడు. వీరసేనుడికి కోపం వచ్చినా తమాయించుకుని, ‘‘ఆస్థాన మాంత్రికుడి పదవి నీకు తగినది కాదు. నెలకు వేయి వరహాలు జీతం నీకు చాలా తక్కువ. కాదంటావా?’’ అన్నాడు. ‘‘ఔను. నాకు తగిన జీతం నెలకు లక్ష వరహాలు. ఆ మాత్రం ఇవ్వగల సంపద నీకున్నది.’’ అన్నాడు క్రోధాక్షుడు. ‘‘నా వద్దనున్న సొమ్ము నాది కాదు. ప్రజలది. ఒక మాంత్రికుడి కోసం నెలనెలా లక్ష వరహాల ప్రజాధనం వృథా చేయడం భావ్యంకాదు. నా మాట విని నీవు ఇక్కణ్ణించి వెళ్లిపో’’ అన్నాడు వీరసేనుడు.