‘‘నందిని వస్తుందా? నువ్వేదో హడావిడి చేసి మమ్మల్ని కూడా పోగేశావు’’ విసుగ్గా అన్నాడు రాజా.‘‘తనమీద తనకి కాన్ఫిడెన్స్‌ ఎక్కువ. నందిని తనమాట వింటుందని గట్టి నమ్మకం. అందుకే మనల్ని కూడా తీసుకొచ్చాడు’’ వంత పాడాడు రమణ. వాళ్ళవంక చూసి ఓ చిరునవ్వు నవ్వి మౌనంగా కూర్చున్నాడు ప్రసాద్‌.

‘‘అనుకున్న టైమ్‌ దాటి అరగంటైంది. అసలు వస్తుందంటావా లేక మనం చేసిన అవమానానికి బదులుగా ఇలా మనల్ని వెయిట్ చేయించి హ్యాండిచ్చి ప్రతీకారం తీర్చుకుంటోందా? సర్లే, ఇంకాసేపట్లో తేలిపోతుందిగా. ఈ లోపు టైమ్‌ పాస్‌కోసం ఓ ప్లేట్ మంచూరియా చెపుదామా’’ ఆశగా అడిగాడు రాజా. అలా అడగటం అప్పటికి నాలుగోసారి.‘‘తను మన అతిథి. తనే ఆర్డర్ చెయ్యాలి’’ చాల స్ర్టిక్ట్ గా చెప్పాడు ప్రసాద్.‘‘తనకు ఏది ఇష్టమో నీకన్నా తెలిసినవాళ్ళు ఎవరూ ఉండరేమో. అవేవో నువ్వే చెప్పెయ్‌’’ ఉచిత సలహా పడేశాడు రమణ.

‘‘నాకు తెలియదనికాదు. మెనూకార్డ్ చేతికిచ్చి ‘నీకు ఏమేమి ఇష్టమో ఆర్డర్ చెయ్‌’ అని చెప్పటంలో తను మనకు ఎంతముఖ్యమో తెలియజేసినట్లు అవుతుంది, మనమిచ్చే విలువ తనకి ఎంత ఆనందాన్నిస్తుందో ఆలోచించండి’’ ‘‘ఇన్నేళ్ళ తరువాత మనల్ని కలవటానికి ఆమె అసలు వస్తుందా అనేదే ఒక అనుమానం. వచ్చినా ఎలా ప్రవర్తిస్తుందో అనేది మరో అనుమానం. నందినికి మనం చేసిన అవమానం తక్కువదేమీ కాదు. అలాంటిది ‘ముఖ్యం, విలువ’ అంటూ నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావనిపిస్తోంది’’ చిరాగ్గా అంటూ ఇయర్ ఫోన్స్ తగిలించుకుని మ్యూజిక్ వినటం మొదలుపెట్టాడు రాజా. రాబోయే నందిని గురించి తనకు పెద్ద ఆసక్తేమీ లేనివాడిలా ప్రక్కనున్న పేపర్లో తలదూర్చాడు రమణ.