అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి. ఆ రాజుకి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారునికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు. సావర్ణికి మూడేళ్ళు నిండాయి. చూడముచ్చటనిపిస్తున్నాడు. ఆడుకుంటున్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు. రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు అన్నాడిలా.‘‘రాకుమారుని వర్ఛస్సు ముందూ, తేజస్సు ముందూ అందరూ తీసికట్టే మహారాజా! వారికి వారే సాటి.’’‘‘బాగా చెప్పారు.’’ అన్నాడు రాజు. అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టుగా అడిగాడిలా.‘‘అన్నట్టు రాకుమారుని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనే లేదు. అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే మూడేళ్ళు నిండితేగాని ఏదీచెప్పరాదన్నారు. నిండాయి కదా, చెప్పండిప్పుడు.’’‘‘తప్పకుండా’’ అన్నాడు పురోహితుడు. చేతిలోని తాళపత్రాలు తెరిచాడు. కళ్ళు మూసుకున్నాడు. పెదవులు కదుపుతూ, చేతిబొటనవేలితో మిగిలిన వేళ్ళ కణుపులను లెక్కించాడు. కళ్ళు తెరచి చెప్పాడిలా.‘‘రాకుమారులు సాహసవంతులు. కీర్తిమంతులు. మీకు తగిన కుమారులు. అయితే...’’‘‘ అయితే?!’’‘‘అయితే ఇంకేం లేదు మహారాజా! రాకుమారుల వివాహ విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది.’’‘‘ఏమిటా ఇబ్బంది?’’ కళ్ళు కుంచించాడు రాజు. ఆసక్తి కనబరిచాడు.‘‘రాకుమారుని జాతకరీత్యా, వారు ఓ పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు.

పేదపిల్ల అయి తేనేం అందంలోనూ, గుణంలోనూ బహుదొడ్డదామె.’’‘‘ఉన్నతరాజవంశానికి చెందిన రాకుమార్తెలు నా కోడలు కావాలిగాని, పూటకి గతిలేని పేదపిల్ల నా కోడలవుతుందా? ఒప్పుకోను.’’ అన్నాడు రాజు. భరించలేనట్టుగా దిగ్గున లేచి నిల్చున్నాడు. రాజుసహా లేచి నిల్చున్నాడు పురోహితుడు. చెప్పాడిలా.‘‘మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా జాతకాన్నీ, విధినీ మార్చలేం మహారాజా! దైవనిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం.’’‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. మీరు కొంచెం శ్రమించి, ఆ పిల్ల ఎక్కడ పుట్టిందీ, లేదంటే ఎక్కడ పుట్టబోతున్నదీ ఆ వివరాలు చెప్పండి.’’ ఆజ్ఞా పించాడు రాజు. పురోహితుడు సరేనని రాత్రీపగలూ పత్రాలు పరిశోధించి, పరిశీలించి, ఓ వారం రోజుల తర్వాత తెలియజేశాడిలా.‘‘మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఓ పేదరైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మించనుంది.’’పేద రైతుపిల్ల తన కోడలా? జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు. రాత్రి అంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచన ఓ కొలిక్కి రావడంతో వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు. కనుమలోకి ప్రవేశించాడు. ప్రయాణించసాగాడు. సూర్యోదయం అయింది. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చుని భోరున ఏడవడాన్ని గమనించాడు రాజు. ఆగాడక్కడ. గుర్రం దిగి, అడిగాడు.‘‘ఎందుకయ్యా ఏడుస్తున్నావు?’’‘‘ఏం చెప్పమంటారు సామీ! నాకు ఇప్పటికే అయిదుగురు ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సూర్యో దయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే అంతా ఓ పూట తిని, ఇంకో పూట పస్తులుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియడం లేదు.’’ అన్నాడు రైతు. చేరాల్సిన చోటుకే చేరాడు తను. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అను కున్నాడు రాజు. ఇలా అన్నాడు.