అతడొఠ్ఠి మెతక మనిషి. భార్యే సంసారం లాక్కొచ్చింది. లేటు వయసులో కలిగిందో ఆడబిడ్డ. కూతుర్ని నానా తంటాలూ పడి చదివించాడా మెతకమనిషి. ఆ చక్కనిచుక్కకి అంతలోనే ఏరికోరి వచ్చాడో వరుడు. ఇక అతడికి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. పెళ్ళికి ఎక్కడా అప్పు పుట్టలేదు. వియ్యంకుడు చెప్పాపెట్టకుండా పెళ్ళిభోజనానికి వందమందిని అదనంగా తీసుకొచ్చాడు. ఆ పెళ్ళి రసాభాసైందా? అతడినెవరైనా ఒడ్డునపడేశారా?

నర్సింహం పెద్దగా చదువుకున్నవాడేంకాదు. బాగా డబ్బున్నవాడూ కాదు. పైగా మొహమాటస్తుడుకూడాను. ఎవరితోను మాట్లాడ్డానికి ధైర్యం చాలేదికాదు. వాడివాలకం తెలిసిన పెద్దమని‌షొకాయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో గుమస్తా ఉద్యోగం వేయించాడు. నర్సింహం అంటే ఆఫీసులో అందరికీ అలుసే. ఒట్టి మెతకమనిషి. అయినా చాలామట్టుకు అతని జీవితం సాఫీగా గడిచింది. అందుక్కారణం అతని భార్య రాజ్యమే. రాజ్యం చాలా మంచిమనిషి. బతకనేర్చినతనం కూడా ఉంది. మొగుడు అమాయకుడని పెళ్ళైన కొద్దిరోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం. దాంతో తనే పగ్గాలు తీసుకుని గుట్టుగా సంసారం నడిపించింది.నర్సింహం భార్యనిచూసి పొంగిపోతూ ఉండేవాడు. ‘నువ్వు లేకపోతే నేను బతకలేకపోదునుకదా రాజ్యం’ అనేవాడు ఏకాంతంలో. ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది. ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది.

అలాంటి ఏకాంత సమయాల్లో నర్సింహం కళ్ళకి రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది. నిజానికి రాజ్యం పెద్ద అందగత్తేమీకాదు. కానీ స్వరవేళలా ఆమెలో సౌందర్యదేవతే కనిపించేది నర్సింహంకి.వాళ్ళకి చాలాకాలందాకా పిల్లల్లేరు. వైద్యాలు చేయించుకోగా, చేయించుకోగా చివరికి ఓ ఆడపిల్ల కలిగింది. అయితే అప్పటికే నలభై అయిదేళ్ళు దాటేశాయి నర్సింహంకి. ‘నేను రిటైరయ్యాక ఈ పిల్ల చదువుసంధ్యలు ఎలారాబాబూ’ అనుకునేవాడు మనసులో. ‘ఫర్వాలేదు. ఏదో ఒకదారి కనబడక పోతుందా’ అని భార్య ధైర్యం చెప్పేది.నర్సింహం కూతురు నిర్మల చాలా తెలివైనది. పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది. టెన్త్‌ పరీక్షలో సెంటర్‌ ఫస్టు వచ్చింది. కానీ ఏంలాభం? అంతకుముందు సంవత్సరమే నర్సింహం రిటైరయ్యాడు. పెన్షన్‌ బెనిఫిట్స్‌గా వచ్చిన రెండులక్షలూ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేశాడు.

నెలవారీ పెన్షన్‌లోంచి ఎంత ఎక్కువడబ్బు పొదుపు చెయ్యగలిగితే అంతా పిల్ల పెళ్ళిఖర్చులకోసం పొదుపుచేస్తున్నారు. ఈ పొదుపుమాటేమోగానీ, చాలా పేదవాళ్ళలా రోజులు గడుపుకోవలసి వచ్చింది. ఏతావాతా పిల్లని పై చదువులకి పంపడం సాధ్యంకాదని తేలిపోయింది. నిర్మలమాత్రం చదువుకుంటానని మారాం చేసింది. తల్లిదండ్రుల నిస్సహాయస్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది. అందుకే తనను జూనియర్‌ కాలేజీలో చేర్చించితీరాలని పట్టుపట్టలేకపోతోంది. కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయుల్ని చూసి కుళ్ళికుళ్ళి ఏడుస్తోంది. కేవలం ఆర్థిక కారణాలవల్ల తన భవిష్యత్‌ అంధకారమయమైపోయిందని తెలిసిపోయింది నిర్మలకి.