‘‘ఆత్మవంచన’’ అని మనసులోనే గొణుక్కున్నాను పొద్దున్నే ఆఫీసులో పల్లవిని చూడగానే.నాకు బాగా పరిచితమైన రూపం అది!ఉబ్బరించిన మొహం.. ఎర్రగా జ్యోతుల్లామండుతున్న కళ్ళూ.. నిస్తేజమైన చూపులూ... ఇలాంటి మొహం చూడగానే నాకుమొత్తం సన్నివేశం అంతా టక్కున అర్థమై పోతుంది.

కానీ చిరాకు ఎక్కడ వస్తుందంటే ఎదుటి వాళ్ళకి స్పష్టంగా విషయం అర్థమవుతున్నా ఆ ఆడవాళ్ళు మొహం గంభీరంగా పెట్టుకుని అసలు తమకే సమస్యా లేదన్నట్లు అభినయిస్తున్నపుడు.మగవాడిని కాబట్టి నాతో చెప్పకపోవడం కాదు.. తోటి ఆడవాళ్ళతోనూ పంచుకోరు కొంతమంది తమ కష్టాలని. అది చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఇలాంటి రూపాన్ని ఎప్పుడు చూసినా నా మనసు గతంలోకి పరుగెత్తుతుంది. పదేళ్ళ క్రితం నాటి సంఘటనలు గుర్తు చేస్తుంది.అప్పట్లో నేను హైదరాబాద్‌లో పనిచేస్తున్నపుడు, సరిత ఇలాటి మొహంతోనే వస్తూ ఉండేది తరచుగా ఉద్యోగానికి. తెలివైన అమ్మాయి. పని చక్కగా చేసేది. కానీ అపుడపుడూ ఆలస్యంగా రావడం.. చెప్పాపెట్టకుండా మానేయడం నన్ను చిరాకు పెట్టేవి. ఆ రెండు పనులూ మిగతా వాళ్ళు కూడా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు అలా డుమ్మా కొట్టిన మర్నాడు నవ్వుతూ తుళ్ళుతూ వచ్చేవాళ్ళు.

ఆ పిల్ల ఏడుస్తూ కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ వచ్చేది.ఒక సోమవారం ఏదో చర్చించాలను కున్నాము. ఆరోజు ఆ అమ్మాయి రాలేదు. మంగళవారం పొద్దున తను రాగానే పిలిచి ఎందుకు రాలేదని అడిగాను. తల కొద్దిగా వంచుకుని మొహం దాచుకుంటూ కారణం కాదని తెలిసిపోయే కారణం చెప్పింది. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్నిసార్లు అడిగినా అదే జవాబు. అసలు కారణం చెప్పదు.చివరికి నేను కొంచెం కఠినంగానే ‘‘ఎందుకండీ అబద్ధాలు! మీరు మూడు వారాలుగా ప్రతీ సోమవారం మానేస్తున్నారు. ఎప్పుడూ సోమవారమే జ్వరం వస్తుందా?’’ అన్నాను.

నామాట పూర్తి కాకముందే ఆ అమ్మాయి మొహం పాలిపోయింది. కళ్ళల్లో నుంచి జలజలా నీళ్ళు కారాయి. నేను కొంచెం కంగారు పడి ‘‘సరే వెళ్ళండి’’ అన్నాను.ఆ అమ్మాయి అలా నా గదిలో నుంచి ఏడుస్తూ వెళ్ళడం చూసి అందరూ ఏమనుకుంటారోనని భయం వేసింది. తలెత్తి చూశాను. పక్కగదిలో మేనేజర్‌గారి సెక్రటరీ శైలజ కూర్చుంటుంది. ఆవిడ బయటికి వచ్చి సరితని తన గదిలోకి తీసుకు వెళ్ళడం. అయిదు నిమిషాల తర్వాత సరిత మళ్ళీ ఇవతలికి వచ్చి తన సీటు దగ్గరికి వెళ్ళడం కనిపిస్తూనే ఉంది.