నాకు నలభై నాలుగేళ్ళు. చూడు రమణీ! నువ్వు కూడా విను పావనీ!.. మీరిద్దరూ మీ దార్లు మీరు చూసుకునేటప్పుడు నేను కూడ నా దారి నేను చూసుకోవడం న్యాయం కదా! మా ఆఫీసులో దానయ్య తెల్సుగా. మొన్నటిదాకా అటెండర్‌గా ఉండి మొన్ననే రికార్డ్‌ అసిస్టెంటయ్యాడు. నాకంటే పదేళ్ళు చిన్నవాడే కావొచ్చు. దానయ్యకు నేనంటే గౌరవం. నా మాటే వేదం.. దానయ్యకు కూడా భార్యపోయింది’’ అంది వసుధ.‘‘అయితే?’’ అంది రమణి ఆతృతగా. ‘నా సేఫ్టీకోసం నేను దానయ్యను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ బాంబు పేల్చింది వసుధ. ఇద్దరూ ఉలికిపడ్డారు. ‘‘ఛీ! ఈ వయస్సులో పెళ్ళేమిటమ్మా! అందులోనూ నీ కంటె తక్కువ హోదావాడు, పదేళ్ళు చిన్నవాడితోనా పెళ్ళి! చెప్పులు కుట్టేవాడినా!’’ టక్కున నోరు జారింది రమణి...
**********************

సెల్‌ రింగవడంతో వసుధ ఆలోచన్లకు బ్రేక్‌ పడింది. హాల్లో ఎప్పట్నించి మోగుతోందో, బ్యాగ్‌లోంచి సెల్‌ తీసి చూసింది. పావని కాలింగ్‌. సెల్‌ ఆన్‌ చేసింది.‘‘హల్లో! చెప్పు నాన్నా!’’ అంది వసుధ.‘‘ఇందాకట్నుంచి రింగ్‌ చేస్తున్నానమ్మా! పడుకున్నావా?’’ అంది పావని.‘‘ఇప్పుడే ఆఫీస్‌ నుంచి వచ్చి స్నానం చేసి, టీ తాగి తలనొప్పిగా ఉంటే అలా నడుము వాల్చా. ఇంటికొచ్చేశావా?’’‘‘ఈ రోజు శనివారం కదా! సెలవు. ఇంటి దగ్గరే ఉన్నాను’’.‘‘ఏమిటి విశేషాలు? నీ ముద్దుల చెల్లెలు రమణి పెళ్ళి గురించి ఏమంటోంది?’’ అడిగింది వసుధ.‘‘కొత్తగా ఏమనలేదు. ‘పోనీ నీ క్లాస్‌మేట్‌ ప్రకాష్‌ను చేసుకోవే’ అన్నానమ్మా. ఏమంటుందో అని. ‘వాడు నాకు మన ‘చింటూ’తో సమానం. నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు అందమ్మా’’ అంది ఒకటే నవ్వుతూ.

ప్రకాష్‌ అంటే రమణికి మెడిసిన్‌లో క్లాస్‌మేట్‌. వాళ్ళ కులం వేరు. బుద్ధిమంతుడు రమణి ఏం చెప్పినా చేస్తాడు. ఎక్కడ్కి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు. రమణికి ఎక్కడికివెళ్ళినా ఎస్కార్ట్‌లా ఉంటాడు. ఒకటి రెండు సార్లు వసుధ వాళ్ళింటికొచ్చి వారం పదిరోజులు ఇద్దరూ పిజికి ప్రిపేరయ్యారు.వసుధ కూడా తేలిగ్గా తీసుకుని నవ్వేసింది. అది తన కూతురు. అది అలాంటి పని ఎప్పుడూ చెయ్యదు. పైగా తనకు ప్రామిస్‌ చేసింది కూడా.‘‘పోనీ హరిని చేసుకోవే అన్నానమ్మా!’’ అంది పావని.వసుధ షాకయ్యింది. అతను కూడా వసుధ వాళ్ళ కులం కాదు.‘‘ఏమందీ?’’ అంది కంగారుగా.‘‘నాకు ఇంతవరకు ఐడియాలేదు. ఆలోచిస్తా. అయినా అమ్మ ఇష్టం అంది’’ పావని.‘‘హరి రమణి కంటే చిన్నవాడే’’.‘‘అలాగా!’’‘‘పైగా మెడిసిన్‌ కాదు. ఎక్కడో స్టేట్స్‌లో ఉంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు దీంతో చదువుకున్నాడు. నల్లగా ఉంటాడు. మన కులం కాదు’’ అంది వసుధ.