ఒకానొకప్పుడు భగీరథుడనే రాజు వేటకై అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుత సౌందర్యవతిని చూసి మోహించాడు. ఆమె భగీరథుడితో, ‘‘రాజా! నా పేరు వనమోహిని. నాకు ఎవ్వరూ లేరు. నువ్వు నన్ను రాణిని చేస్తానంటే, నీతో వచ్చేస్తాను. అయితే, ఒక్కషరతు. ఈ క్షణంనుంచీ, నీవు నా చెప్పుచేతల్లో ఉండాలి’’ అంది. మోహావేశంలో భగీరథుడు అందుకు ఒప్పుకుని, ఆమెను గాంధర్వవిధిన పెళ్ళాడి, రాజ్యానికి తీసుకువెళ్లాడు. అంతఃపురంలో అడుగుపెడుతూనే, వనమోహిని పూర్వపురాణి యశోధరనూ, ఆమె ఏకైకపుత్రుడు శతరథుడినీ రాజ్యంనుంచి వెళ్లగొట్టించింది. వారిద్దరూ అడవిపాలై, ఓ ముని ఆశ్రమం చేరుకున్నారు.

ఆ ముని పేరు దర్భానందుడు. అతడు యశోధర కథ తెలుసుకుని, ‘‘అమ్మా! మీరిద్దరూ నా ఆశ్రమంలో ఉండండి. నీవు దిగులు వదిలిపెట్టు. ఇప్పుడు నీ కొడుకు పదేళ్లవాడు. నేనితడికి శిక్షణనిచ్చి సకలవిద్యా పారంగతుణ్ణి చేస్తాను. పదహారేండ్లు వచ్చేసరికి, ఇతడు స్వశక్తితో నీకు తిరిగి అంతఃపురంలో స్థానంసంపాదించి పెడతాడు’’ అన్నాడు. యశోధర కృతజ్ఞతాపూర్వకంగా, మునికి వందనం చేసింది. తల్లీకొడుకులిద్దరూ ఆ రోజునుంచీ ఆశ్రమవాసులయ్యారు.దర్భానందుడు ఉదయమే లేచి, శతరథుణ్ణి వెంటబెట్టుకుని సమీపంలోని నదీతీరానికి వెళ్లేవాడు.

ఇద్దరూ అక్కడ స్నానం చేశాక, దర్భానందుడు శతరథుడికి కాసేపు విద్యాబోధన చేసేవాడు. తర్వాత, ముని మధ్యాహ్నసమయంవరకూ అక్కడే ఓ రావిచెట్టునీడలో తపస్సు చేసుకునేవాడు. శతరథుడు ముని దగ్గరే ఉండి, ఆయన తపస్సుకు భంగం కలగకుండా కాపలా కాసేవాడు. మధ్యాహ్నం వారు తిరిగి ఆశ్రమానికి చేరుకునేసరికి, యశోధర వంట సిద్ధంచేసేది. వంటకు అవసరమైన పదార్థాలు, కట్టెలు సమీపంలోని బోయపల్లెనుంచి కొందరు బోయలు తెచ్చి ఇస్తూండేవారు. భోజనమైనాక, ముని విశ్రమించేవాడు. ఆ సమయంలో, శతరథుడు తాను చదివినది మననం చేసుకునేవాడు.