దక్షిణాపథాన ఉన్న మహాచైతన్య పీఠం అది. ఆ పీఠాధిపతి మహాస్వామి సుదర్శనతీర్థంకరులు. అశేషభక్తవాహిని ఆయన దర్శనంకోసం బారులుతీరింది. స్వయంగా ఆయన ఇస్తున్న తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ తరిస్తున్నారు భక్తజనం. కానీ ఒక వ్యక్తి మాత్రం సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అలా మూడు రోజులు ఎదురుచూశాడు. నాలుగవరోజు ముందుకు దూసుకెళ్ళి ఆయనకు అడ్డుపడ్డాడు. ఇంతకీ అతడెవరు?

కర్నూలునుంచి రామనాథం మాస్టారు ఫోనుచేసి ‘భాస్కరం నీకో కబురురా’ అన్నారు.మాస్టారి గొంతుకలో ఏదో ఉద్వేగం ధ్వనించిందా అనిపించింది.‘‘కబురా చెప్పండి మాస్టారు’’ అన్నాను.నీవు గతపదిహేనేళ్ళుగా చంద్రం ఆచూకి ఏమైనా దొరికిందా అని వాకబుచేస్తూనే ఉన్నావుగా. ఇదిగో ఇన్నాళ్ళకు వాడి ఆచూకి దొరికింది. రేపుసాయంత్రం ఆరుగంటలకు మీ నెల్లూరుమీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జేశ్వరంవెళ్ళే ఏదో సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌లో వెళుతున్నానని తనే ఫోనుచేసి చెప్పాడు అన్నారు మాస్టారు.ఆ వార్తతో నేను ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. ‘‘అవునా’’ అన్నాను నమ్మలేనంతగా.‘చంద్రం ఇన్నాళ్ళూ ఎక్కడున్నాడు, ఉజ్జేశ్వరం ఎందుకు వెళ్ళుతున్నాడు అని నన్ను అడగకు. ఆ వివరాలు అడిగేఅవకాశం అతను నాకివ్వలేదు. అతడసలు నాకోసం ఫోను చేయలేదనుకుంటా. నీ ఫోనునెంబరు తెలియక తన ప్రయాణంవార్త నీకు తెలియచేయటానికే అన్నట్టుగా ఉంది ఆ ఫోన్‌కాల్‌’ అన్నారు మాస్టారు.

చంద్రం అంటే చంద్రశేఖరం మాస్టారుగారి అబ్బాయి.చంద్రశేఖరంను గురించిన ఈ వార్త నన్ను ఆనందంతో కుదిపేసింది. ఆనందం ఎందుకంటే అతడింక లేడేమో అనుకునే నిర్ణయానికి వస్తున్న తరుణంలో ఉన్నాడని తెలియటం ఆనంద హేతువుకాక మరేవిటి?మాస్టారే మళ్ళీ కొనసాగిస్తూ ‘భాస్కరం నా ప్రస్తుత పరిస్థితి తెలుసుగా, నా కదలికలన్నీ వీల్‌చైర్‌ ఆసరాతోనే. వాడిని చూడాలని ఉన్నా నాకా శక్తిలేదు. నువ్వే వాడికి నా ఆరోగ్య పరిస్థితిచెప్పి కర్నూలు రమ్మనిచెప్పు. వాడు మాకు ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లుచేసి వెళ్ళాననుకుంటున్నాగానీ, వాడు మా కళ్ళముందు లేనిలోటువల్ల, మాకు ఏమీ లేనట్లే అనిపిస్తోంది’ అన్నారు. ‘ఆ సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ నెల్లూరు స్టేషన్‌లో ఆగేది ఒకే ఒక్కనిమిషం మాత్రమే. ఆ నిమిషంలో వాడి పదిహేనేళ్ళ అదృశ్యజీవితాన్నిగురించి నేనేమడిగేది. వాడేమిచెపుతాడుకనుక’ అనుకొంటూ, అరగంటముందే స్టేషన్‌కు చేరుకున్నాను. తీరావెళ్ళాక అది అసలు టైముకంటే అరగంట ఆలస్యంగా వస్తుందన్నారు.